Stock Market: నష్టాలతో ముగిసిన మార్కెట్ సూచీలు.. 561 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు,అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల,విదేశీ మదుపర్ల భారీ అమ్మకాలు,రూపాయి విలువ క్షీణించడం వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ ఒత్తిడిని ఎదుర్కొని నష్టాల్లో రోజును ముగించాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 84.60 డాలర్లకు చేరుకోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచింది. ఇదే సమయంలో సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) రూ.3,062 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ పరిస్థితులు నెలకొనే అవకాశాలపై వస్తున్న సంకేతాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.
వివరాలు
సెన్సెక్స్ 561 పాయింట్లు, నిఫ్టీ@ 24,052
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.20కు పడిపోవడం, బ్యాంకింగ్ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరగడం కూడా సూచీలపై ప్రభావం చూపాయి.
గత ట్రేడింగ్ సెషన్‌లో 77,616 వద్ద ముగిసిన సెన్సెక్స్ మంగళవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది.
ప్రారంభ నష్టాల నుంచి కొంత కోలుకున్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత విక్రయాలు మరింత ఊపందుకోవడంతో మార్కెట్ మళ్లీ ఒత్తిడికి గురైంది.
చివరకు సెన్సెక్స్ 561 పాయింట్లు కోల్పోయి 77,054 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇదే ధోరణిని అనుసరించింది.
రోజంతా ఒత్తిడిలో ట్రేడైన ఈ సూచీ చివరకు 158 పాయింట్లు తగ్గి 24,052.05 వద్ద స్థిరపడింది.
వివరాలు
274 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్
రంగాల వారీగా చూస్తే బయోకాన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదానీ పవర్, ఎంసీఎక్స్ ఇండియా, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు లాభాల్లో నిలిచాయి.
మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, లోధా డెవలపర్స్, టాటా ఎలాక్సీ, ఎన్‌బీసీసీ, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
సూచీల పరంగా బ్యాంక్ నిఫ్టీ 669 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 274 పాయింట్లు పడిపోయింది.
అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మార్కెట్లలో అస్థిరత మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.