Loading...
Indigo: ఇండిగో 20వ వార్షికోత్సవ ఆఫర్.. 20 వేల మందికి ఉచిత విమాన టికెట్లు
ఇండిగో 20వ వార్షికోత్సవ ఆఫర్.. 20 వేల మందికి ఉచిత విమాన టికెట్లు

Indigo: ఇండిగో 20వ వార్షికోత్సవ ఆఫర్.. 20 వేల మందికి ఉచిత విమాన టికెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో తన 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 'ఇండిగోఫ్రీ' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ కింద 20 వేల మంది అదృష్టవంతులైన కస్టమర్లకు ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించనుంది. ఎంపికైన ప్రయాణికులకు ఒక్కో పీఎన్‌ఆర్‌పై గరిష్ఠంగా రూ.10 వేల వరకు టికెట్ చార్జీని తిరిగి చెల్లించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు చేసిన బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా 6Eskai AI వర్చువల్ అసిస్టెంట్ ద్వారా బుక్ చేసే దేశీయ విమాన టికెట్లకే ఈ అవకాశం ఉంటుంది.

వివరాలు 

ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేందుకు మొత్తం మూడు అవకాశాలు

ఆఫర్ వ్యవధిలో టికెట్లు బుక్ చేసిన ప్రయాణికుల్లో నుంచి 20 వేల మందిని ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా ఒక సులభమైన ప్రశ్నను పంపిస్తారు.

ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేందుకు మొత్తం మూడు అవకాశాలు కల్పిస్తారు.

ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చిన వారికి వారి టికెట్ చార్జీని గరిష్ఠంగా రూ.10వేల వరకు రీఫండ్ చేస్తారు.

ఈ మొత్తాన్ని 3 నుంచి 5 పని దినాల్లో సంబంధిత ఖాతాల్లో జమ చేస్తామని ఇండిగో తెలిపింది.

ఈ ఆఫర్ దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్లతో పాటు ఇండిగో స్ట్రెచ్ బుకింగ్‌లకు కూడా వర్తిస్తుంది.

అలాగే వన్‌వే,రిటర్న్ టికెట్లు బుక్ చేసిన ప్రయాణికులు కూడా ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.

వివరాలు 

ఇండిగో వద్ద 430కు పైగా విమానాలు

ప్రస్తుతం ఇండిగో వద్ద 430కు పైగా విమానాలు ఉన్నాయి.

రోజుకు సుమారు 2,200 విమాన సర్వీసులను నిర్వహిస్తున్న ఈ సంస్థ దేశీయంగా 95కు పైగా, అంతర్జాతీయంగా 40కు పైగా గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది.

అలాగే 2025 స్కైట్రాక్స్ అవార్డ్స్లో భారత్‌తో పాటు దక్షిణాసియాలో అత్యుత్తమ విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది.

ADVERTISEMENT