Indigo: ఇండిగో వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. బుకింగ్స్, చెక్-ఇన్‌లో ఇబ్బందులు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న ఇండిగోకు బుధవారం సాంకేతిక సమస్య ఎదురైంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో తలెత్తిన లోపం కారణంగా పలువురు ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు ప్రయాణించేందుకు ఇండిగో వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేసిన సమయంలో ఈ సమస్య కనిపించింది. వేర్వేరు తేదీలను ఎంచుకుని విమానాల కోసం సెర్చ్ చేసినప్పటికీ అందుబాటులో ఉన్న సర్వీసుల వివరాలు కనిపించలేదని ప్రయాణికులు తెలిపారు.
వివరాలు
టికెట్ బుకింగ్‌కే కాకుండా ఆన్‌లైన్ చెక్-ఇన్ ప్రక్రియను పూర్తి చేయడంలోనూ సమస్యలు
ఇండిగో టికెట్‌ను మరో ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా బుక్ చేసుకునే సమయంలోనూ సాంకేతిక సమస్య ఎదురైనట్లు కొందరు ప్రయాణికులు పేర్కొన్నారు.
కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించాలని ఆ ప్లాట్‌ఫామ్ సూచించినట్లు తెలిపారు.
వెబ్‌సైట్‌లో ఏర్పడిన అంతరాయంపై పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఫిర్యాదులు చేశారు.
కేవలం టికెట్ బుకింగ్‌కే కాకుండా ఆన్‌లైన్ చెక్-ఇన్ ప్రక్రియను పూర్తి చేయడంలోనూ సమస్యలు ఎదురయ్యాయని వెల్లడించారు.
విమానాలకు సంబంధించిన వివరాలు తెరపై కనిపించకపోవడంతో తదుపరి దశకు వెళ్లలేకపోయామని చెప్పారు.
వివరాలు
గత డిసెంబరులోనూ ఇండిగోలో సాంకేతిక సమస్యలు
అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యకు గల కారణాలపై ఇండిగో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఈ లోపం వల్ల ఎంతమంది ప్రయాణికులు ప్రభావితమయ్యారనే వివరాలను కూడా సంస్థ వెల్లడించలేదు.
దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగోకు 65 శాతానికి పైగా మార్కెట్ వాటా ఉంది.
గత డిసెంబరులోనూ సంస్థ భారీ స్థాయిలో కార్యకలాపాల అంతరాయాన్ని ఎదుర్కొంది.
పైలట్ల రోస్టర్ నిర్వహణలో తలెత్తిన లోపాల కారణంగా సుమారు 4,500 విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వివరాలు
ఆన్‌లైన్ వ్యవస్థలపై ఆందోళనలు
తాజాగా మరోసారి డిజిటల్ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో విమాన ప్రయాణాలకు సంబంధించిన ఆన్‌లైన్ వ్యవస్థలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం టికెట్ బుకింగ్, విమానాల వివరాల పరిశీలన, ఆన్‌లైన్ చెక్-ఇన్ వంటి కీలక సేవలు వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
ఇలాంటి సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే ప్రయాణికులు నేరుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.