Page Loader
Industrial output growth: 9 నెలల కనిష్ట స్థాయికి పారిశ్రామిక ఉత్పత్తి .. మేలో 1.2 శాతం వృద్ధికి పరిమితం 
9 నెలల కనిష్ట స్థాయికి పారిశ్రామిక ఉత్పత్తి .. మేలో 1.2 శాతం వృద్ధికి పరిమితం

Industrial output growth: 9 నెలల కనిష్ట స్థాయికి పారిశ్రామిక ఉత్పత్తి .. మేలో 1.2 శాతం వృద్ధికి పరిమితం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత పారిశ్రామికోత్పత్తి వృద్ధి (IIP) మే 2025లో గణనీయంగా మందగించి కేవలం 1.2 శాతానికి పరిమితమైంది. ఇది గత తొమ్మిది నెలల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.రుతుపవనాలు సాధారణ సమయానికి ముందు రావడం వల్ల తయారీ,గనుల తవ్వకం,విద్యుత్తు రంగాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో ఐఐపీ వృద్ధి తగ్గిందని జాతీయ గణాంక కార్యాలయం (NSO) వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో,అంటే మే 2024లో ఐఐపీ వృద్ధిరేటు 6.3శాతంగా నమోదైంది. 2025 ఏప్రిల్‌ నెలలో ఐఐపీ ముందస్తు అంచనా ప్రకారం వృద్ధి 2.7శాతంగా ఉండగా,తాజాగా ఎన్‌ఎస్‌ఓ దాన్ని 2.6శాతంగా సవరించింది. అంతకుముందు 2024 ఆగస్టు నెలలో ఐఐపీ వృద్ధి శూన్యానికి సమానం కాగా,ఆ తర్వాత మే 2025లో నమోదైన 1.2 శాతం కనిష్ఠ స్థాయిగా నిలిచింది.

వివరాలు 

తయారీ, గనుల తవ్వకం, విద్యుత్తు రంగాల్లో పడిపోతున్న వృద్ధి 

తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి, 2024 మే నెలలో 5.1 శాతంగా ఉండగా, 2025 మేలో అది 2.6 శాతానికి తగ్గింది. గనుల తవ్వక రంగంలో గతేడాది ఇదే నెలలో 6.6 శాతం వృద్ధి నమోదైనప్పటికీ, 2025 మేలో కేవలం 0.1 శాతం మాత్రమే వృద్ధి కనిపించింది. విద్యుత్తు ఉత్పత్తిలోనూ పెద్దగా తగ్గుదల నమోదైంది. మే 2024లో ఇది 13.7 శాతంగా ఉండగా, 2025 మే నాటికి అది 5.8 శాతానికి పడిపోయింది.

వివరాలు 

ఏప్రిల్-మే నెలల్లో వృద్ధి 1.8 శాతం మాత్రమే 

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో కలిపి పారిశ్రామికోత్పత్తి వృద్ధి కేవలం 1.8 శాతంగా నమోదైంది. ఇది గత ఆర్థిక సంవత్సరం అదే కాలంలో నమోదైన 5.7 శాతంతో పోలిస్తే చాలా తక్కువ. రుతుపవనాల ముందస్తు రాక వల్ల కొన్ని కీలక రంగాల్లో ఉత్పత్తి ప్రభావితమైందని, దాంతో మే నెల వృద్ధిలో మందగమనం వచ్చిందని ఇక్రా సంస్థ ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు.

వివరాలు 

ద్రవ్య లోటు 0.8 శాతానికి పరిమితం 

దేశ ద్రవ్య లోటు 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో బడ్జెట్ అంచనాల ప్రకారం 0.8 శాతానికి (రూ. 13,163 కోట్లు) చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) వివరించారు. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య తేడానే ద్రవ్య లోటుగా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరం అదే కాలంలో ఇది 3.1 శాతంగా నమోదైంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరం మొత్తం ద్రవ్య లోటు స్థూల దేశీయోత్పత్తిలో (GDP) 4.4 శాతానికి, అంటే రూ.15.69 లక్షల కోట్లకు చేరనుందని బడ్జెట్ అంచనాల్లో (BE) ప్రభుత్వం ముందుగా వెల్లడించిన విషయం తెలిసిందే.