
RBI: మార్చిలో 2.3 శాతానికి బ్యాంకుల మొండి బకాయిలు.. 2027 మార్చికి పెరగొచ్చు ఆర్‌బీఐ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ బ్యాంకింగ్ రంగంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) ఈ సంవత్సరం మార్చి నాటికి గత పది ఏళ్లలో కనిష్ట స్థాయైన 2.3శాతానికి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది. 2024సెప్టెంబర్ నాటికి ఈ ఎన్‌పీఏలు 2.6శాతంగా ఉన్నాయని పేర్కొంది.అయితే,2027 మార్చికి 46బ్యాంకుల ఎన్‌పీఏలు మళ్లీ 2.6శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ తన అర్ధవార్షిక 'రిజర్వ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ'నివేదికలో హెచ్చరించింది. గత దశాబ్దంలో భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ప్రధాన సమస్యల్లో మొండి బకాయిలు ఒకటిగా నిలిచాయి. ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో ఏర్పడిన ఆర్థిక ఒత్తిడులు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. అయితే,బ్యాంకులు తీసుకున్న వ్యూహాత్మక చర్యల ద్వారా ఈ సమస్య క్రమంగా అదుపులోకి వచ్చింది.
వివరాలు
అగ్రగామి 100రుణగ్రహీతల్లో ఒక్కరు కూడా ఎన్‌పీఏ జాబితాలో లేరు
గతఐదేళ్ల కాలంలో స్థూల ఎన్‌పీఏల తగ్గుదలకు ప్రధాన కారణాలు సాంకేతిక రైటాఫ్‌లు, రుణ రైటాఫ్‌లు అని నివేదిక స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో ఈ రుణాలను తిరిగి వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు చేసిన రైటాఫ్‌లు స్థూల ఎన్‌పీఏలతో పోలిస్తే 29.5శాతం కాగా,2024-25 నాటికి ఈ నిష్పత్తి 31.8శాతానికి పెరిగిందని నివేదిక వివరించింది. ప్రైవేట్ రంగ బ్యాంకులు,విదేశీ బ్యాంకులు తమ రైటాఫ్‌లను పెంచగా,ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రైటాఫ్‌లు కొద్దిగా తగ్గినట్లు వెల్లడించింది. స్థూల ఎన్‌పీఏల్లో వ్యవసాయ రంగానికి అత్యధికంగా 6.1శాతం వాటా ఉన్నదని,వ్యక్తిగత రుణాల్లో ఈ శాతం 1.2గాఉందని పేర్కొంది. అగ్రగామి 100రుణగ్రహీతల్లో ఒక్కరు కూడా ఎన్‌పీఏ జాబితాలో లేరని నివేదిక హైలైట్ చేసింది.
వివరాలు
క్రెడిట్ కార్డ్ ఎన్‌పీఏలు పెరుగుతున్న ప్రభుత్వ బ్యాంకులు
2025 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ కార్డు రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు 14.3 శాతానికి పెరిగాయి. 2024 సెప్టెంబరులో ఇది 12.7 శాతంగా ఉండేది. అయితే, ప్రైవేట్ రంగ బ్యాంకుల క్రెడిట్ కార్డు విభాగంలో ఎన్‌పీఏలు స్థిరంగా 2.1 శాతంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది.
వివరాలు
అంతర్జాతీయ వృద్ధిలో భారత్ కీలక భూమిక
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ఆర్ బి ఐ నివేదిక పేర్కొంది. ఇది బలమైన ఆర్థిక పునాదులు, అనుకూల విధానాల వలన సాధ్యమవుతోందని వివరించింది. అయితే, అంతర్జాతీయ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలాన్ని పరీక్షిస్తున్నాయని హెచ్చరించింది. స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులతో ముందుకు సాగుతున్నాయని, దీనికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు విధానాలలో జరిగే మార్పులే ప్రధాన కారణమని పేర్కొంది. అయితే దేశీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం సానుకూలంగా ఉందని, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల బ్యాలెన్స్ షీట్లు మెరుగవ్వడం వలన వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశం ఏర్పడుతోందని వివరించింది.
వివరాలు
ఆర్థిక స్థిరత్వం అత్యంత అవసరం: సంజయ్ మల్హోత్రా
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా సమానంగా ముఖ్యమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకోవడంతో పాలసీ రంగ జోక్యాలు సవాళ్లుగా మారాయని చెప్పారు. వినియోగదారుల భద్రత కోసం ఆర్థిక నియంత్రణ సంస్థలు తగిన చర్యలు తీసుకుంటున్నాయని, ఆర్థిక రంగ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.