
online gaming rules: ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త ముసాయిదా నిబంధనలు విడుదల .. ప్రజల అభిప్రాయాలు కోరిన ఐటీ మంత్రిత్వ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తాజాగా ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం, నియంత్రణ చట్టం - 2025 అమలు భాగంగా ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. ఈ ముసాయిదాపై ప్రజలు ఈ నెలాఖరు వరకు అభిప్రాయాలు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆగస్టులో పార్లమెంట్ ఆమోదం తెలిపిన చట్టానికి అనుసంధానంగా ఈ చర్య చేపట్టారు. ఇందులో ముఖ్యంగా డబ్బుతో జరిగే ఆన్‌లైన్ గేమ్స్‌ను నిషేధించి, ఈ-స్పోర్ట్స్,సోషల్ గేమ్స్‌కు ప్రోత్సాహం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి.
రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్
కేటగిరీలు, రిజిస్ట్రేషన్‌పై స్పష్టత
ముసాయిదా నిబంధనల్లో గేమ్స్‌ను ఎలా వర్గీకరించాలి, రిజిస్ట్రేషన్ ఎలా జరగాలి అన్నదానిపై పూర్తి వివరాలు ఉన్నాయి. అనుమతించదగిన గేమ్స్‌కి ప్రోత్సాహం ఇవ్వడం, వాటి పర్యవేక్షణ చేసే ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారాలు, బాధ్యతలను కూడా వివరించారు. ఈ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం, జరిమానాలు విధించడం, వినియోగదారుల ఫిర్యాదులకు పరిష్కారం చూపే అధికారం కలిగి ఉంటుంది.
రెగ్యులేటరీ అధికారం
కొత్త అథారిటీ ఏర్పాటు
దేశంలో ప్రత్యేకంగా ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీని నియంత్రణ సంస్థగా ఏర్పాటు చేయాలని ముసాయిదా ప్రతిపాదిస్తోంది. ఇందులో ఒక చైర్మన్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన మరో ఐదుగురు సభ్యులు ఉంటారు. గేమ్ "మనీ గేమ్" కింద వస్తుందా లేదా అన్నది నిర్ణయించడం, రిజిస్ట్రేషన్ ఇవ్వడం, మార్గదర్శకాలు జారీ చేయడం, నిబంధనల ఉల్లంఘనపై శిక్షలు విధించడం వంటి అధికారాలు ఈ సంస్థకు ఉంటాయి.
జరిమానాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే మొత్తం సంస్థపై బాధ్యత
ఆన్‌లైన్ గేమ్స్‌లో చట్టవిరుద్ధ చర్యలకు అవకాశం కల్పిస్తే అది జామీను లేని నేరంగా పరిగణించబడుతుందని ముసాయిదా చెబుతోంది. ఒక గేమ్ రిజిస్ట్రేషన్ తరువాత దాని ఆదాయ విధానం మారితే, అది డబ్బుతో ఆడే గేమ్‌గా మారిందా లేదా అన్నది అథారిటీ నిర్ణయిస్తుంది. తప్పు తేలితే ఆ గేమ్‌కి ఇచ్చిన రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది.
నమోదు అవసరాలు
రిజిస్ట్రేషన్‌కి కంపెనీలు ఇవ్వాల్సిన వివరాలు
ఆన్‌లైన్ గేమ్స్‌కి రిజిస్ట్రేషన్ కోరే సంస్థలు తమ ఆదాయ నమూనా, వినియోగదారుల భద్రతా విధానాల వివరాలు సమర్పించాలి. ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్‌లు లేదా వన్‌టైమ్ ఫీజుల ద్వారానే ఆదాయం వస్తుందని నిరూపించాలి. డబ్బుతో పందాలు లేదా బెట్టింగ్ ద్వారా ఆదాయం పొందితే శిక్షలు తప్పవు. వినియోగదారులకు నష్టం కలిగితే, ఎంత లాభం పొందారనే అంశాల ఆధారంగా అథారిటీ జరిమానా నిర్ణయిస్తుంది.
ఫిర్యాదుల పరిష్కారం
ఫిర్యాదుల పరిష్కారానికి మూడు స్థాయిల వ్యవస్థ
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం మూడు స్థాయిల మెకానిజాన్ని ముసాయిదా ప్రతిపాదిస్తోంది. మొదటగా గేమ్ కంపెనీ స్వయంగా పరిష్కారం చూపాలి. సంతృప్తి లేకపోతే వినియోగదారు గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (IT రూల్స్ 2021 కింద ఏర్పాటు అయినది) వద్దకు వెళ్లవచ్చు. అక్కడ కూడా సమస్య తీరకపోతే గేమింగ్ అథారిటీకి అప్పీలు చేయవచ్చు. ఈ విధానం వల్ల ఫిర్యాదులు సమయానికి పరిష్కారం కావచ్చని ప్రభుత్వం చెబుతోంది.