AI Scam Call: ఏఐతో మాయ చేసి.. ఇటలీ బ్యాంకుకు రూ.1,034 కోట్ల కుచ్చుటోపి!
ఈ వార్తాకథనం ఏంటి
ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకున్న కేటుగాళ్లు ఓ బ్యాంకుకు ఏకంగా రూ.1,034 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టారు. బ్యాంకులోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా నమ్మించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ క్లోనింగ్ సృష్టించి భారీ మొత్తాన్ని కొల్లగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటలీలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా ఉన్న ఇంటెసా శాన్‌పాలోలో ఈ భారీ మోసం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
సీఈఓగా నమ్మించి AI వాయిస్‌తో కాల్
ఇటలీలోని అతిపెద్ద బ్యాంకు ఇంటెసా శాన్‌పాలోకు సంబంధించిన విభాగమైన ఫిడ్యూరమ్ మాజీ ఛైర్మన్ పావొలో మోలెసినిని కేటుగాళ్లు ఫిబ్రవరిలో టార్గెట్ చేశారు.
ఇంటెసా శాన్‌పాలో సీఈఓ కార్లో మెస్సీనా మాట్లాడుతున్నట్లుగా నమ్మించేందుకు ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని ఉపయోగించారు.
కార్లో మెస్సీనా స్వరాన్ని పోలిన ఏఐ వాయిస్‌తో పావొలో మోలెసినికి ఫోన్ కాల్ చేశారు. దీంతో ఆ కాల్ నిజంగానే బ్యాంకు సీఈఓ నుంచి వచ్చిందని ఆయన నమ్మారు.
కేటుగాళ్లు చెప్పిన మాటలను విశ్వసించిన పావొలో.. విదేశీ ఖాతాల్లో ఉన్న నిధులను ట్రాన్స్‌ఫర్ చేయాలని తన ఫైనాన్స్ విభాగాన్ని ఆదేశించారు.
వివరాలు
అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన సంస్థ
అయితే భారీ మొత్తంలో జరుగుతున్న లావాదేవీలపై ఫిడ్యూరమ్ సంస్థ అప్రమత్తమైంది. అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించి, విదేశాల్లోని సంబంధిత బ్యాంకులు, సిబ్బందిని అలర్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
సంస్థ సకాలంలో స్పందించడంతో దాదాపు రూ.570కోట్ల నగదును రికవరీ చేయగలిగారు.
అయితే మిగిలిన మొత్తాన్ని కేటుగాళ్లు పలు విదేశీ ఖాతాల్లోకి తరలించి, ఆ తర్వాత బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలుగా మార్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ మొత్తాన్ని గుర్తించడం, తిరిగి రికవరీ చేయడం కష్టంగా మారింది.
ఈ భారీ AIస్కామ్ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఏఐ వాయిస్ క్లోనింగ్ వంటి టెక్నాలజీలను ఉపయోగించి సీనియర్ అధికారులుగా నమ్మించి భారీ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న తీరును ఈ ఘటన మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.