Loading...
INDIA Bloc: సెప్టెంబర్ 30న ఇండియా కూటమి కీలక భేటీ.. 'SIR'పై ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం!
సెప్టెంబర్ 30న ఇండియా కూటమి కీలక భేటీ.. 'SIR'పై ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం!

INDIA Bloc: సెప్టెంబర్ 30న ఇండియా కూటమి కీలక భేటీ.. 'SIR'పై ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 26, 2026
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 'సర్' (SIR) వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) విషయంలో ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు చోటుచేసుకున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఇదే సమయంలో సెప్టెంబర్ 30న ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం కానుంది.

వివరాలు

విపక్ష పార్టీలు చర్చించే అవకాశం

ఈ సమావేశంలో విపక్ష పార్టీల నేతలు సమావేశమై ఎన్నికల సంఘం (EC), ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశాలపై చర్చించనున్నారు.

ఎన్నికల సంఘంలోనే SIRకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో.. ఈ అంశంపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించే విషయాన్ని కూడా విపక్ష పార్టీలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు

ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు

ప్రస్తుతం ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఉన్నారు.

SIRకు సంబంధించిన పలు నిర్ణయాలు, ఆదేశాలపై సంధు, జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో వారు తమ అభిప్రాయాలను రికార్డులో నమోదు చేసినట్లు ఒక నివేదిక పేర్కొంది. అయితే ఈ వార్తలపై ఎన్నికల సంఘం స్పందించింది.

భిన్నాభిప్రాయాలు సంస్థాగత చర్చల్లో సాధారణమైనవేనని ఈసీ స్పష్టం చేసింది. నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని పేర్కొంది.

అంతర్గతంగా వ్యక్తమయ్యే అభిప్రాయాలు, పరిశీలనలు కూడా నిర్ణయ ప్రక్రియలో భాగమేనని ఎన్నికల సంఘం వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు

మమత.. సీపీఎం మధ్య చర్చలు

ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC), సీపీఎం కూడా ఎన్నికల సంఘం, SIR అంశంపై ఒకే వేదికపై చర్చించే పరిస్థితి ఏర్పడింది.

సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ.. ఇండియా కూటమి, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు లేఖ రాసి సమావేశం నిర్వహించాలని కోరినట్లు సమాచారం.

ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో ఎం.ఏ. బేబీ మాట్లాడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితిపై సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని మమతా బెనర్జీ వ్యక్తం చేసినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

CEC తొలగింపునకు నోటీసు?

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ డిమాండ్ చేస్తున్నాయి.

అదే సమయంలో SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కూడా ఈ పార్టీలు కోరుతున్నాయి. కాంగ్రెస్ సైతం జ్ఞానేష్ కుమార్‌పై తన విమర్శలను మరింత తీవ్రం చేసింది.

ఈ క్రమంలో జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు మరోసారి పార్లమెంట్‌లో తొలగింపు నోటీసు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

న్యాయ నిపుణుల పరిశీలన అనంతరం ఈ నోటీసును లోక్‌సభ, రాజ్యసభల్లో సమర్పించే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఇలా జరిగితే CEC జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు చేపట్టే తొలగింపు చర్యల్లో ఇది మూడో ప్రయత్నం అవుతుంది.

వివరాలు

సెప్టెంబర్ 29న కాంగ్రెస్ కీలక సమావేశం

ఈ అంశంపై కాంగ్రెస్ కూడా తన తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం నిర్వహించనుంది.

ఈ సమావేశంలో ఎన్నికల సంఘం, SIR అంశాలపై పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుండగా.. మరుసటి రోజే అంటే సెప్టెంబర్ 30న ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో సమావేశం కానున్నాయి.

వరుసగా జరిగే ఈ సమావేశాల నేపథ్యంలో ఎన్నికల సంఘం, SIR అంశాలపై ప్రతిపక్షాల తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది

వివరాాలు

అసలు వివాదం ఏంటి?

SIR ప్రక్రియలో ఓటర్ల పేర్ల చేర్పు, తొలగింపు, పునరుద్ధరణ, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ వంటి అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పలు కథనాలు వెల్లడించాయి.

ముఖ్యంగా ఓటర్ల డేటాబేస్ నిర్వహణకు సంబంధించిన అధికారాలు ఢిల్లీలో కేంద్రీకృతమవుతున్నాయన్న ఆందోళనను వారు వ్యక్తం చేసినట్లు ఒక నివేదిక పేర్కొంది.

డేటాబేస్ నిర్వహణలో అధికారాల కేంద్రీకరణపై వారి అభిప్రాయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే SIRకు సంబంధించిన ఫారమ్-6లో కొత్త ప్రకటనను చేర్చడంపైనా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మరో నివేదిక వెల్లడించింది.

వారి అభిప్రాయం ప్రకారం.. చట్టబద్ధమైన ఫారమ్‌లో మార్పులు చేయాలంటే అందుకు సంబంధించిన నిబంధనలను కూడా సవరించాల్సి ఉంటుంది.

వివరాలు

తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకుంటాం

అయితే ఎన్నికల సంఘం మాత్రం కమిషన్‌లో అంతర్గతంగా అభిప్రాయ భేదాలు లేదా పరిశీలనలు వ్యక్తం కావడం సంస్థాగత చర్చల్లో సాధారణ ప్రక్రియేనని, తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో SIRపై ఈసీలోని సభ్యుల అభిప్రాయాలు, విపక్షాల నిరసనలు, పార్లమెంట్‌లో CEC తొలగింపు నోటీసు అంశం, సెప్టెంబర్ 29-30 తేదీల్లో జరగనున్న కాంగ్రెస్, ఇండియా కూటమి సమావేశాలు తదుపరి పరిణామాలపై ఉత్కంఠను పెంచుతున్నాయి.

ADVERTISEMENT