LOADING...
Cigarette prices: సిగరెట్ రేట్లు పెరగనున్నాయా?.. మార్కెట్లో ఐటీసీ షేర్స్ దూకుడు

Cigarette prices: సిగరెట్ రేట్లు పెరగనున్నాయా?.. మార్కెట్లో ఐటీసీ షేర్స్ దూకుడు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 29, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

సిగరెట్ ధరలు వచ్చే నెలలో 17 శాతం వరకు పెరగనున్నాయనే వార్తల నేపథ్యంలో మంగళవారం సిగరెట్ కంపెనీల షేర్లు భారీగా ఎగిశాయి. ఏప్రిల్ 29న ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్లు 6.5 శాతం వరకు లాభపడ్డాయి. ఏప్రిల్ 29 మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో ఐటీసీ షేరు 4 శాతం పెరగగా, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేరు 6.5 శాతం ఎగిసింది. ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం, ఈ రెండు కంపెనీలు వచ్చే నెలలో సిగరెట్ ధరలను పెంచనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం వెల్లడించింది. ప్రీమియం ఉత్పత్తులతో పాటు తక్కువ ధరల బ్రాండ్లపైనా ఇదే స్థాయిలో ధరల పెంపు ఉండే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

వివరాలు

ఆ ధరలు పెరిగే అవకాశం..

ఐటీసీకి చెందిన గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం సిగరెట్ ప్యాక్ ధర ప్రస్తుతం రూ.115 ఉండగా, మే 2026లో అది సుమారు రూ.135కు పెరిగే అవకాశముందని డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన సమాచారాన్ని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. ఏప్రిల్ 29 మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీ 2 శాతం లాభాల్లో ట్రేడ్ అయింది. ఇందులో ఐటీసీ షేరు ప్రధానంగా లాభాలను నడిపించింది. ఇదివరకు ఈ ఏడాది ప్రారంభంలో సిగరెట్ కంపెనీల షేర్లపై ఒత్తిడి కనిపించింది. పార్లమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025కు ఆమోదం తెలపడంతో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచేందుకు మార్గం సుగమమైంది.

వివరాలు

సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం..

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఇప్పటికే ఉన్న 40 శాతం జీఎస్టీకి అదనంగా సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం విధించనున్నారు. సిగరెట్ పొడవును బట్టి ప్రతి 1,000 స్టిక్స్‌పై రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ డ్యూటీ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కొత్త సుంకాల వల్ల 75 నుంచి 85 మిల్లీమీటర్ల పొడవు ఉన్న సిగరెట్ల మొత్తం ఖర్చు 22 నుంచి 28 శాతం వరకు పెరుగుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు పేర్కొన్నారు.

Advertisement

వివరాలు

ఆ కంపెనీలకు భారీ ఆదాయం..

75 మిల్లీమీటర్లకు పైబడిన సిగరెట్లు ఐటీసీ మొత్తం విక్రయాల్లో సుమారు 16 శాతం వాటా కలిగి ఉన్నాయని, కొత్త పన్నుల ప్రభావంతో ఒక్కో స్టిక్ ధర రూ.2 నుంచి రూ.3 వరకు పెరగవచ్చని తెలిపారు. అధిక రిటైల్ ధరల ప్రభావంతో తాత్కాలికంగా అమ్మకాల పరిమాణం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ధరలను నిర్ణయించే సామర్థ్యం సిగరెట్ కంపెనీలకు చారిత్రాత్మకంగా బలంగా ఉందని జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ ఈ ఏడాది ప్రారంభంలో వ్యాఖ్యానించారు. అధిక పన్నుల పరిస్థితుల్లో కూడా లాభదాయకతను కాపాడుకునే సామర్థ్యం ఈ కంపెనీలకు ఉందని ఆయన అన్నారు.

Advertisement