Jensen Huang Love Story: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ లవ్ స్టోరీ మళ్లీ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన భార్య లోరీ మిల్స్‌ను తొలిసారి ఎలా కలిశారు? ఆమెతో పరిచయం ప్రేమగా ఎలా మారింది? అనే విషయాలను ఆయన స్వయంగా చెప్పిన ఈ వీడియో 2024 నవంబర్‌లో రికార్డైంది. హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి గౌరవ డిగ్రీ అందుకున్న సందర్భంగా ఈ అనుభవాలను పంచుకున్నారు.
Details
హోంవర్క్‌తో మొదలైన పరిచయం
అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో హువాంగ్‌కు 17 ఏళ్లు, లోరీకి 19 ఏళ్లు.
తన తరగతిలో 250 మంది విద్యార్థులు ఉండగా, అమ్మాయిలు ముగ్గురే ఉన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. లోరీతో మాట్లాడేందుకు ఆమెకు తన హోంవర్క్ చూపిస్తానని, ప్రతి ఆదివారం కలిసి చదివితే మంచి గ్రేడ్లు సాధించవచ్చని సరదాగా చెప్పారట.
అలా మొదలైన చదువు సమావేశాలు క్రమంగా డేటింగ్‌గా మారాయి. 30 ఏళ్లకే తాను కంపెనీ సీఈఓ అవుతానని కూడా అప్పట్లో ఆమెతో చెప్పినట్లు వెల్లడించారు.
Details
ఐదేళ్ల తర్వాత పెళ్లి.. ఇద్దరు పిల్లలు
పరిచయమైన ఐదేళ్లకు హువాంగ్, లోరీ వివాహం చేసుకున్నారు. వీరికి మాడిసన్, స్పెన్సర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ ప్రస్తుతం ఎన్విడియాలో పనిచేస్తున్నారు.
ఇటీవల భార్యకు ద్రోహం చేసిన విషయాన్ని హువాంగ్ ఎన్విడియా ఉద్యోగులకు పంపిన సందేశంలో అంగీకరించారు.
తన చర్యల వల్ల భార్య, పిల్లలు బాధపడ్డారని, అందుకు ఎలాంటి సాకులు చెప్పలేనని క్షమాపణలు కోరారు. తిరిగి వారి నమ్మకాన్ని సంపాదించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Details
హువాంగ్‌పై విదేశీ నిఘా ఆరోపణల విచారణ
మరోవైపు, తనను లక్ష్యంగా చేసుకుని విదేశీ నిఘా కార్యకలాపాలు జరిగాయన్న వార్తలపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణ ప్రారంభించింది.
స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ, బయటి న్యాయ నిపుణుల సహకారంతో ఈ పరిశీలన కొనసాగుతోంది. హువాంగ్ కూడా విచారణకు పూర్తిగా సహకరిస్తానని అంగీకరించారు.
ఈ పరిణామాల మధ్య ఆయన పాత ప్రేమకథ మళ్లీ వెలుగులోకి రావడం ఆసక్తి రేపుతోంది.