Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన 46వ వార్షిక సాధారణ సమావేశం 2023ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు ముకేష్ అంబానీ ప్రకటించారు. భారతదేశాన్ని ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా మార్చే ప్రతిష్టాత్మక మిషన్ రిలయన్స్ జియోను ఏడేళ్ల క్రితం ప్రారంభించినట్లు తెలిపారు. భారత అద్భుతమైన డిజిటల్ పరివర్తనకు జియో ప్రధాన ఉత్ప్రేరకమన్నారు. ఇప్పుడు తమ ఆశయాలు భారతదేశ తీరాన్ని దాటినట్లు పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో 5G రోల్ అవుట్‌ను ప్రారంభించినట్లు ముకేష్ అంబానీ చెప్పారు.
డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ అందుబాటులోకి: అంబానీ
కేవలం 9 నెలల్లో జియో 5జీ 96 శాతానికి పైగా పట్టణ జనాభాకు అందుబాటులోకి వచ్చినట్లు ముకేష్ అంబానీ పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గత 10 ఏళ్లలో 150 బిలియన్ డాలర్లు పెట్టుబడులను దేశంలో పెట్టినట్లు ముకేష్ చెప్పారు. ఏ భారతీయ కార్పోరెట్ కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేదన్నారు. తాము అసాధ్యమని అనిపించిన లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, వాటిని సాధించుకున్నట్లు చెప్పారు. భారతదేశంలో పనిచేస్తున్న మొత్తం 5జీ సెల్‌లలో దాదాపు 85శాతం జియో నెట్‌వర్క్ పరిధిలోనే ఉన్నట్లు చెప్పారు. తాము ప్రతి 10 సెకన్లకు ఒక 5జీ సెల్‌ను తమ నెట్‌వర్క్‌కి జోడిస్తున్నట్లు స్పష్టం చేశారు.