Jio IPO: రూ.37,700 కోట్ల జియో ఐపీవో.. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మూలధన మార్కెట్లలో మరో మెగా ఐపీఓ సందడి మొదలైంది. ఇటీవల ఎన్‌ఎస్‌ఈ భారీ ఐపీవో దరఖాస్తు చేసిన తర్వాత తాజాగా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ కూడా ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం సెబీకి డ్రాఫ్ట్ పత్రాలను సమర్పించింది. సుమారు రూ.37,700 కోట్ల (4 బిలియన్ డాలర్లు) సమీకరణ లక్ష్యంగా ఈ ఐపీవోను తీసుకొస్తున్నారు. దీంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. ప్రస్తుతం రూ.27,870 కోట్లతో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో పేరిట ఉన్న రికార్డు చెరిగిపోనుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 27 కోట్ల ఫ్రెష్ షేర్లను జారీ చేయనున్నారు. ఇవి జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.9 శాతం వాటాకు సమానం.
వివరాలు
రిలయన్స్ బాధ్యతలు వారసులకే..
కంపెనీ విలువను దాదాపు 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. సమీకరించే నిధుల్లో సుమారు రూ.27,500 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసత్వ బదిలీ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. కంపెనీ భవిష్యత్ బాధ్యతలను తన పిల్లలు ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు సమర్థంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇషా అంబానీ కన్జ్యూమర్ వ్యాపారాలకు, ఆకాశ్ అంబానీ టెక్నాలజీ విభాగానికి, అనంత్ అంబానీ ఇంధన రంగానికి నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. గత మూడేళ్లుగా వారు రిలయన్స్ బోర్డులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
ఎఫ్‌ఎంసీజీ విభాగంపై భారీ లక్ష్యాలు
రాబోయే నాలుగేళ్లలో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆదాయం రూ.లక్ష కోట్ల మార్కును చేరుకునే అవకాశముందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. దేశంలోనే అగ్రగామి ఎఫ్‌ఎంసీజీ సంస్థగా ఎదగడంతో పాటు ప్రపంచస్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. మరో మూడు సంవత్సరాల్లో అదనంగా రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. జామ్‌నగర్ రిఫైనరీకి కొత్త రూపు ప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి కలిగిన రిఫైనరీగా జామ్‌నగర్ ప్లాంట్‌ను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు అనంత్ అంబానీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ టు కెమికల్స్ వ్యాపార ఆదాయం 5.7 శాతం పెరిగి రూ.6.62 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వివరించారు.
వివరాలు
ఏజీఎం ముఖ్యాంశాలు
జియో వినియోగదారులు: జియోహాట్‌స్టార్ నెలవారీ యాక్టివ్ యూజర్లు 451 మిలియన్లు. తడ్కా మైక్రోకంటెంట్ ప్లాట్‌ఫామ్ 100 మిలియన్ యూజర్లను దాటింది. రిలయన్స్ రిటైల్ విస్తరణ: అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ నుంచి ఎఫ్‌ఎంసీజీ వరకు బలోపేత సరఫరా వ్యవస్థ. 1,200 నగరాలకు జియోమార్ట్ క్విక్ కామర్స్ సేవలు. ఇంధన రంగం: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య కూడా చమురు శుద్ధి గరిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. గ్రీన్ ఎనర్జీ రంగంపై ప్రత్యేక దృష్టి. ఓ2సీ పరివర్తన: ముడి చమురును కార్బన్ ఫైబర్, ప్రత్యేక లోహాలు, పర్యావరణహిత రసాయనాల వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చే ప్రణాళిక.
వివరాలు
ఏజీఎం ముఖ్యాంశాలు
న్యూ ఎనర్జీ: సౌరశక్తి, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, గ్రీన్ హైడ్రోజన్, భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్, కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగాలే భవిష్యత్ వృద్ధికి కీలకమని సంస్థ తెలిపింది. ఎగుమతులు: 2032 నాటికి 125 నుంచి 150 బిలియన్ డాలర్ల ఎగుమతి వ్యవస్థను నిర్మించడమే లక్ష్యం. ఈబీఐటీడీఏ: వచ్చే ఐదేళ్లలో సంస్థ ఈబీఐటీడీఏను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. డివిడెండ్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌పై రూ.6 తుది డివిడెండ్‌కు వాటాదారులు ఆమోదం తెలిపారు.
వివరాలు
శాట్‌కామ్ రంగంలోకి జియో
భూమిపై టెలికాం సేవల్లో అగ్రస్థానంలో ఉన్న జియో ఇప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలోకి ప్రవేశిస్తోంది. భారత్ కోసం సావరిన్ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. స్టార్‌లింక్, యూటెల్‌శాట్ వంటి విదేశీ సంస్థలకు పోటీగా దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలు, ద్వీపాలు, సరిహద్దు ప్రాంతాలకు కూడా శాటిలైట్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యమన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యంతో సావరిన్ గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు తెలిపారు.
వివరాలు
రిలయన్స్ ఇంటెలిజెన్స్.. కొత్త వృద్ధి చోదకం
దేశీయ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేధస్సు సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో గ్రూప్ ఏఐ వెంచర్‌ను తీసుకొస్తున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు. గూగుల్, మెటా, ఎన్విదియాలతో భాగస్వామ్యంతో వ్యవసాయం నుంచి విద్య, సంస్థాగత రంగాల వరకు అన్ని భారతీయ భాషల్లో పనిచేసే ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
వివరాలు
జియో కాల్ ఏఐ ఏజెంట్
జియో నెట్‌వర్క్‌లోనే ఏఐ అసిస్టెంట్‌ను అనుసంధానం చేస్తూ జియో కాల్ ఏఐ ఏజెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రత్యేక యాప్ అవసరం లేకుండానే ఫోన్ కాల్ సమయంలో "హేయ్ జియో" అని పిలిస్తే ఈ ఏఐ సేవ యాక్టివేట్ అవుతుంది. ప్రత్యేకతలు: రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్. పది మంది కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్నా సంభాషణ గుర్తింపు. స్థానిక భాషల్లో సారాంశం. కాల్ ముగిసిన తర్వాత పూర్తి సమీక్ష. కాల్‌లో నుంచే క్యాబ్ బుకింగ్. ఫుడ్ ఆర్డర్. రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్.
వివరాలు
మై జియో యాప్‌కు ఏఐ రూపం
ప్రస్తుతం రీచార్జ్‌లు, అకౌంట్ సేవలకు పరిమితమైన మై జియో యాప్‌ను పూర్తిస్థాయి పర్సనల్ ఏఐ అడ్వైజర్‌గా మారుస్తున్నారు. యాప్‌లో వేర్వేరు మెనూలు వెతకాల్సిన అవసరం లేకుండా, వినియోగదారు నోటితో చెప్పిన పనులను ఏఐ అసిస్టెంట్ పూర్తి చేసే విధంగా రూపొందిస్తున్నారు. జియో టెలిఫ్రేమ్ ఇంట్లోని వివిధ ఏఐ సేవలకు కేంద్రంగా పనిచేసే జియో టెలిఫ్రేమ్ అనే సరికొత్త స్మార్ట్ డివైస్‌ను జియో ఆవిష్కరించింది. రోజువారీ కార్యక్రమాలను గుర్తుచేయడం, డాక్టర్ అపాయింట్‌మెంట్‌లపై సమాచారం ఇవ్వడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా సూచనలు చేయడం వంటి సేవలను ఇది అందించనుంది.
వివరాలు
భారత యువతకు అంబానీ పిలుపు
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సావరిన్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం చేపడుతున్నామని, రిలయన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా భారత అవసరాలకు తగిన నవతరం ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నామని ముకేశ్ అంబానీ తెలిపారు. దేశ భవిష్యత్తు కోసం భారతీయ యువ ఇంజినీర్లు ఏఐ రంగంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.