Page Loader
Bike taxi: కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం.. హైకోర్టు ఆదేశాలతో ర్యాపిడో, ఉబర్‌ సేవలకు బ్రేక్‌
కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం.. హైకోర్టు ఆదేశాలతో ర్యాపిడో, ఉబర్‌ సేవలకు బ్రేక్‌

Bike taxi: కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం.. హైకోర్టు ఆదేశాలతో ర్యాపిడో, ఉబర్‌ సేవలకు బ్రేక్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో, ఉబర్‌, ఓలా వంటి ప్రముఖ సంస్థలు సోమవారం ఉదయం నుంచి తమ బైక్‌ ట్యాక్సీ సేవలను ఆపివేశాయి. కోర్టు తీర్పుని పరిగణనలోకి తీసుకున్న ర్యాపిడో సంస్థ తమ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సేవల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని సంస్థ తెలిపింది. ఉబర్‌ సంస్థ తన బైక్‌ ట్యాక్సీ సేవలను 'ఉబర్‌ మోటో కొరియర్‌' పేరిట కొనసాగించగా, ఓలా యాప్‌ నుంచి బైక్‌ ట్యాక్సీ ఎంపికను పూర్తిగా తొలగించింది. వాస్తవానికి, మోటార్‌ వెహికల్స్‌ చట్టంలో బైక్‌ ట్యాక్సీలకు స్పష్టమైన ప్రస్తావన లేకపోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారింది.

Details

వేలాది మంది జీవితాలపై ప్రభావం

దీంతో కర్ణాటక హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇంతకు ముందు ఈ సేవలను నిలిపివేయాలని ఆదేశిస్తూ జూన్‌ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ తీర్పును బైక్‌ ట్యాక్సీ సంస్థలు సవాలు చేయగా, డివిజన్‌ బెంచ్‌ కూడా సింగిల్‌ బెంచ్‌ తీర్పునే సమర్థించింది. జూన్‌ 20లోగా రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూన్‌ 24కు వాయిదా వేసింది. దీంతో బైక్‌ ట్యాక్సీల సేవలు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీనివల్ల వేలాది మంది గిగ్‌ వర్కర్ల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని నమ్మ బైక్‌ ట్యాక్సీ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన అసోసియేషన్‌.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.