eMudhra shares crash: కొంపముంచిన 'కీ' లీక్.. రెండు రోజుల్లో 35% పడిపోయిన ఇ-ముద్రా షేర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ సర్టిఫికేషన్ అథారిటీ ఇ-ముద్రా లిమిటెడ్ (eMudhra) షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ జారీ చేసిన పబ్లిక్ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (PKI) పరిధిలోని ప్రైవేట్ కీలు బహిర్గతమైనట్లు వెల్లడైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో గురువారం ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేరు ధర ఏకంగా 18 శాతం క్షీణించి రూ.351.35 వద్ద ట్రేడవుతోంది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో కలిపి షేరు విలువ దాదాపు 35 శాతం పడిపోయింది.
వివరాలు
ఎందుకీ పతనం?
బెంగళూరుకు చెందిన ఇ-ముద్రా లిమిటెడ్ డిజిటల్ ఐడెంటిటీ, సైబర్ సెక్యూరిటీ సేవలను అందించే సంస్థ.
డిజిటల్ సిగ్నేచర్లు, ఎలక్ట్రానిక్ అథంటికేషన్, సెక్యూరిటీ సర్టిఫికెట్లను జారీ చేస్తుంది. దేశీయంగా డిజిటల్ సిగ్నేచర్, ఇ-సైన్ సేవలను అందిస్తుండగా.. అంతర్జాతీయంగా వెబ్‌సైట్లకు భద్రతా సర్టిఫికెట్లను (eMudhra Certificate) జారీ చేస్తుంది.
ఒక వెబ్‌సైట్ నమ్మదగినదా? కాదా? అనే విషయాన్ని గుర్తించడంలో ఈ సర్టిఫికెట్లు కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే ఇ-ముద్రా జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి భారత సైబర్ భద్రతా విభాగం కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అధికారిక అడ్వైజరీ జారీ చేసింది.
ఇ-ముద్రా పీకేఐ వ్యవస్థ పరిధిలోని ఎనిమిది ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లకు సంబంధించిన ప్రైవేట్ కీలు లీక్ అయినట్లు వెల్లడించింది.
వివరాలు
రెండు కోడ్ సైనింగ్ సర్టిఫికెట్లు ఉన్నాయి
వీటిలో ఆరు ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ(TLS)సర్టిఫికెట్లు, రెండు కోడ్ సైనింగ్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ పరిణామంపై గూగుల్, మొజిల్లా అప్రమత్తమయ్యాయి.
ప్రభావితమైన లింకులు, సర్టిఫికెట్లను బ్లాక్ చేశాయి. సర్టిఫికెట్ల భద్రతపై ఆందోళనలు నెలకొనడంతో ఇ-ముద్రా షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
ఫలితంగా కంపెనీ షేరు ధర గణనీయంగా పడిపోయింది. మరోవైపు దేశంలో విస్తృతంగా వినియోగించే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు, ఇ-సైన్ సేవలకు ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదని ఇ-ముద్రా స్పష్టం చేసింది.
ఆ సేవలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా అందించే టీఎల్‌ఎస్ సర్టిఫికెట్ల వ్యాపారం తమ మొత్తం కార్యకలాపాల్లో చాలా చిన్న భాగమని పేర్కొంది.