NPCIL: కూడంకుళం డేటా లీక్‌పై స్పష్టత.. అణు భద్రతా వ్యవస్థలకు ఎలాంటి ముప్పు లేదన్న NPCIL
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం (Kudankulam Nuclear Power Plant)కు సంబంధించిన డేటా లీక్ వార్తలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) అధికారికంగా స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చింది. లీకైన సమాచారం అణు భద్రతా వ్యవస్థలకు సంబంధించినది కాదని, కేవలం బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ (Balance of Plant) విభాగానికి చెందిన ఫైళ్లేనని స్పష్టం చేసింది. అణు భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉందని వెల్లడించింది. NPCIL విడుదల చేసిన ప్రకటనలో, కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న 3, 4 యూనిట్లకు సంబంధించిన డేటా లీకైనట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయని పేర్కొంది.
వివరాలు
అణు భద్రతా వ్యవస్థలతో ఎలాంటి సంబంధం లేదు
అయితే బయటకు వచ్చిన సమాచారం అణు రియాక్టర్ లేదా భద్రతా వ్యవస్థలకు సంబంధించినది కాదని వివరించింది. లీకైన ఫైళ్లు బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ విభాగానికి చెందినవని తెలిపింది.
ఈ ప్రాజెక్టులో 3, 4 యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) కాంట్రాక్ట్‌ను 2018లో నిర్వహించిన పబ్లిక్ టెండర్ ద్వారా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు అప్పగించినట్లు NPCIL వెల్లడించింది.
బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ విభాగం థర్మల్ పవర్ ప్లాంట్లు, ఇతర పారిశ్రామిక ప్రాజెక్టుల్లో ఉండే విధంగానే సాధారణ ఇంజినీరింగ్, సరఫరా, నిర్మాణ సేవలను మాత్రమే నిర్వహిస్తుందని తెలిపింది.
దీనికి అణు భద్రతా వ్యవస్థలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
వివరాలు
బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ పనులకు కాంట్రాక్టర్‌గా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
అణు భద్రతకు సంబంధించిన అన్ని కీలక వివరాలు అత్యంత రహస్యంగా భద్రపరిచిన ప్రత్యేక వ్యవస్థల్లోనే ఉంటాయని,అవి ఎక్కడా లీక్ కాలేదని NPCIL వెల్లడించింది.
అణు కేంద్ర భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని సంస్థ మరోసారి స్పష్టం చేసింది.
ఇటీవల అంతర్జాతీయ మీడియాలో కూడంకుళం అణు కేంద్రానికి సంబంధించిన ఫైళ్లు లీకైనట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ ప్రాజెక్టులో బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ పనులకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తోంది.
ఈ సంస్థ వినియోగిస్తున్న థర్డ్ పార్టీ డేటా సెంటర్‌పై సైబర్ దాడి జరిగినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనలో అక్కడ భద్రపరిచిన కొంత డేటా పాక్షికంగా లీకైనట్లు కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు.
వివరాలు
19వేల ఫైళ్లు కూడంకుళం ప్రాజెక్టుకు సంబంధించినవి
సమాచారం ప్రకారం,రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన సుమారు 8.6లక్షల ఫైళ్లు డార్క్‌వెబ్‌లో కనిపించినట్లు తెలుస్తోంది.
వాటిలో దాదాపు 19వేల ఫైళ్లు కూడంకుళం ప్రాజెక్టుకు సంబంధించినవిగా గుర్తించినట్లు సమాచారం.
లీకైన పత్రాల్లో 3, 4యూనిట్లలో వినియోగించే వెంటిలేషన్ వ్యవస్థలు, కూలింగ్ సిస్టమ్‌లకు సంబంధించిన బ్లూప్రింట్లు ఉన్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు సమాచారం. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం భారత్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది.
రష్యా సహకారంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. మొత్తం ఆరు రియాక్టర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉండగా, ఇప్పటికే రెండు రియాక్టర్లు విద్యుత్ ఉత్పత్తిలో ఉన్నాయి.
మిగిలిన నాలుగు రియాక్టర్లు ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో కొనసాగుతున్నాయి.