Apple: యాపిల్‌లో లేఆఫ్స్.. 200 మంది ఉద్యోగులపై వేటు.. అసలు కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ దాదాపు 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా సిరి డిజిటల్ అసిస్టెంట్, విజన్ ప్రో హెడ్‌సెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాఫ్ట్‌వేర్ విభాగాల్లో చోటుచేసుకున్నాయి. విజన్ ప్రో హార్డ్‌వేర్ విభాగంలో దాదాపు 100 పోస్టులు, సిరి, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బృందాల్లో మరో 100 పోస్టులను తొలగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విజన్ ప్రో కోసం గేమింగ్ ఫీచర్లను అభివృద్ధి చేస్తున్న గేమింగ్ విభాగాన్ని కంపెనీ పూర్తిగా మూసివేసింది. ఈ మార్పులు కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే చేపడుతున్నట్లు యాపిల్ వెల్లడించింది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బందికి సంస్థలోని ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది.
వివరాలు
సరికొత్త ఏఐ సిరిపై దృష్టి
యాపిల్ ప్రస్తుతం సిరి కోసం సరికొత్త ఏఐ ఆధారిత వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది.
దీనికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన సిబ్బందిని సమకూర్చుకునేందుకు ప్రస్తుత బృందంలో మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.
యాపిల్ డివైజ్‌లలో ఏఐ ఫీచర్లను పర్యవేక్షించే ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ఎక్స్‌పీరియన్స్ విభాగంలోనూ మార్పులు జరుగుతున్నాయి.
వివరాలు
విజన్ ప్రోపై తగ్గుతున్న ఆసక్తి
మరోవైపు, విజన్ ప్రో కోసం ఇమ్మెర్సివ్ వీడియోల రూపకల్పనకు యాపిల్ మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది.
అయితే ఈ హెడ్‌సెట్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య పరిమితంగా ఉండటంతో కంపెనీపై ఆర్థిక ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.
దీంతో ఇకపై సొంతంగా కంటెంట్‌ను రూపొందించడాన్ని తగ్గించి, ఇతర తయారీ సంస్థలను ఈ రంగంలో ప్రోత్సహించాలని యాపిల్ నిర్ణయించింది.
విజన్ ప్రో, విజన్‌ఓఎస్ అభివృద్ధిని కొనసాగిస్తూనే.. భవిష్యత్తులో స్మార్ట్ గ్లాసెస్‌పై మరింత దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తోంది.
2028 చివరి నాటికి కొత్త విజన్ ప్రో మోడల్‌ను తీసుకొచ్చే అంశాన్ని కూడా యాపిల్ పరిశీలిస్తోంది.