Page Loader
ట్విట్టర్‌ కొత్త పరిపాలన అధికారిగా ఛార్జ్ తీసుకున్న లిండా యాకరినో
ట్విట్టర్ లేడీ బాస్ గా లిండా యాకరినో

ట్విట్టర్‌ కొత్త పరిపాలన అధికారిగా ఛార్జ్ తీసుకున్న లిండా యాకరినో

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 05, 2023
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

లేడీ బాస్ లిండా యాకారినో, ట్విట్టర్ కొత్త సీఈఓగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. 'ట్విట్టర్ 2.0'ని అన్ని విధాలా బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు నూతన బాస్ లిండా వెల్లడించారు. ఈ మేరకు ఎన్‌బిసిలో తనతో కలిసి పనిచేసిన తోటి ఉద్యోగి, తనకు విశ్వసనీయమైన సలహాదారుడు జో బెనారోచ్‌ను సైతం ఆమె ట్విట్టర్ లో నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు కొత్తగా ఫాలోవర్లు పెరిగారని ఆమె తెలిపారు. తాను ఇంకా ఎలన్ మస్క్‌ అంతటి విజయవంతమైన వ్యక్తిని కాలేదన్నారు. అయితే ట్విట్టర్‌ను అభివృద్ధి చేయడంలో మాత్రం ఆయనతో సమానంగా కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు యూజర్ల ఫీడ్‌బ్యాక్‌ చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.

Linda Takes Charge As Twitter Ceo

నా తర్వాత నా అంతటి సీఈఓ లిండా: మస్క్ 

ట్విట్టర్ సంస్థకు కొత్తగా సీఈఓని నియమించానని, మరో ఆరు వారాల్లో తదుపరి సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారని ఎలాన్ మస్క్ అప్పట్లోనే క్లూ ఇచ్చారు. అయితే ఆమె ఎవరో కాదు, లిండా యాకరినోనే. ఈ పేరే గతంలో ఎక్కువగా వినిపించింది. తాజా పరిణామాలతో మస్క్ ఇచ్చిన హింట్ నిజమైంది. కంపెనీకి తన తర్వాత, అంతటి బెస్ట్ సీఈఓగా లిండానే సమర్థురాలని మస్క్ భావించారట. అందుకే ఏరికోరి మరీ లిండాకే బరువు బాధ్యతలను అప్పగించారని సమాచారం. ఇప్పటివరకు ట్విట్టర్ సీఈఓలుగా పనిచేసిన వారందరూ టెకీలే కాగా లిండా యాకరినోది మాత్రం భిన్నమైన రంగం. నాన్ - టెకీ రంగం నుంచి ఎంపికైన మొదటి ట్విట్టర్ సీఈఓగా ఆమె చరిత్ర సృష్టించారు.

Linda Takes Charge As Twitter Ceo

సమర్థురాలు కాబట్టే  లిండాకు పాలన పగ్గాలు: మస్క్ 

యాకరినో మీడియా రంగానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. దాదాపు 20 ఏళ్లకు పైగా గ్లోబల్ అడ్వర్టైజింగ్, భాగస్వామ్య వ్యాపారాలకు సారథ్యం వహిస్తూ అనేక ఉన్నత పదవుల్లో ఎన్.బీ.సీ యూనివర్సల్‌లో విధులు నిర్వర్తించారు. మస్క్‌ ఫ్రెండే లిండా యాకారినో ట్విటర్ అధినేత ఎలాన్‌ మస్క్‌కు కొత్త సీఈఓ లిండా యాకారినో ఫ్రెండ్ అని బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. గతంలో మస్క్ తీసుకున్న విధానాలను యాకారినో చాలా సార్లు బహిరంగంగానే ప్రశంసించారని, అతనికి మద్దతుగా నిలిచినట్లు ఇన్‌సైడర్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ట్విటర్ పరిపాలన లిండా చేతికి వెళ్లినట్టు సమాచారం.