బ్లూటిక్ వినియోగదారులు ట్విట్టర్‌లో 2గంటల నిడివి వీడియోను అప్‌లోడ్ చేయొచ్చు
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో మరో కీలక మార్పుకు నాంది పలికారు ఆ సంస్థ చీఫ్ ఎలోన్ మస్క్. బ్లూటిక్ వినియోగదారులు ట్విట్టర్‌లో 2గంటల నిడివి వరకు వీడియోలను అప్‌లోడ్ చేయొచ్చని ప్రకటించారు. ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ సబ్‌స్క్రైబర్‌లు ఇప్పుడు 2-గంటల వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చని ఈ మేరకు మస్క్ ట్వీట్ చేశారు. చెల్లింపు ప్లాన్‌లో మార్పులు చేసే సమయంలో 60 నిమిషాల వీడియోను అప్లోడ్ చేయొచ్చని చెప్పిన ట్విట్టర్, ఇప్పుడున్న దాన్ని రెండు గంటలకు పెంచినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ పోర్టల్ టెక్ క్రంచ్ చెప్పింది.
వీడియో ఫైల్ సైజు పరిమితి 2జీబీ నుంచి 8జీబీకి పెంపు
చెల్లింపు వినియోగదారుల కోసం వీడియో ఫైల్ సైజు పరిమితిని ఇప్పుడు 2జీబీ నుంచి 8జీబీBకి పెంచినట్లు టెక్ క్రంచ్ తెలిపింది. ఇంతకుముందు సుదీర్ఘ వీడియో అప్‌లోడ్ చేయాలంటే వెబ్ నుంచి మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు అది ఐఓఎస్ యాప్ ద్వారా కూడా వీడియోను అప్లోడ్ చేయవచ్చు. అప్‌లోడ్ కోసం గరిష్ట నాణ్యత ఇప్పటికీ 1080pగానే ఉన్నట్లు టెక్ క్రంచ్ నివేదించింది. మస్క్ ఈ ప్రకటన చేసిన వెంటనే నెటిజన్ల రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ కొత్త నెట్‌ఫ్లిక్స్ అంటూ ఒక వినియోగదారు స్పందించగా, 'చాలా బాగుంది! దీన్ని సాధ్యం చేసినందుకు ధన్యవాదాలు' అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. 'ట్వీట్‌ట్యూబ్‌కు స్వాగతం' స్వాగతం అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.