Loading...
UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పు.. ఛార్జీల వసూలుకు లోక్‌సభ ఆమోదం..
యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పు.. ఛార్జీల వసూలుకు లోక్‌సభ ఆమోదం..

UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పు.. ఛార్జీల వసూలుకు లోక్‌సభ ఆమోదం..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 06, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న యూపీఐ (UPI) చెల్లింపు వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశాన్ని కల్పించే పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ సవరణతో యూపీఐ లావాదేవీలపై రుసుములు విధించే అధికారాన్ని బ్యాంకులకు అప్పగించే మార్గం సుగమమైంది. ఈ బిల్లును లోక్‌సభలో పెద్దగా చర్చ జరపకుండా ఆమోదించారు. తదుపరి దశలో దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపిస్తారు. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే చట్టం అమల్లోకి రానుంది. దీంతో యూపీఐ చెల్లింపుల విధానంలో ఇది ఒక ప్రధాన మార్పుగా నిలవనుంది.

వివరాలు

ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?

ప్రస్తుతం యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం వంటి సాధారణ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు.

వినియోగదారులు పూర్తిగా ఉచితంగానే ఈ సేవలను ఉపయోగిస్తున్నారు.

అయితే మొబైల్ రీఛార్జ్‌లు, విద్యుత్ బిల్లులు, ఇతర యుటిలిటీ చెల్లింపుల వంటి కొన్ని సేవలపై ఇప్పటికే పరిమిత రుసుములు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి.

కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం పెద్ద వ్యాపారుల వద్ద జరిగే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారు.

వినియోగదారు యూపీఐ ద్వారా చెల్లింపు చేసినప్పుడు, ఆ మొత్తాన్ని స్వీకరించే వ్యాపారిపై బ్యాంకులు నిర్దిష్ట రుసుము వసూలు చేయనున్నాయి.

ఈ ఛార్జీలు నేరుగా వినియోగదారులపై కాకుండా వ్యాపారులపై వర్తించనున్నాయి.

వివరాలు

రూ.2 వేలకుపైగా లావాదేవీలపై అవకాశం..

ప్రాథమిక సమాచారం ప్రకారం, రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ లావాదేవీలపై మాత్రమే ఈ రుసుములు అమలు చేసే అవకాశం ఉంది.

అలాగే చిన్న దుకాణాలు, చిన్న వ్యాపారులపై కాకుండా పెద్ద స్థాయి వ్యాపారులకే ఈ నిబంధనలు వర్తించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

గతంలో యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) పేరుతో వ్యాపారుల నుంచి రుసుములు వసూలు చేసేవారు.

అయితే 2020లో కేంద్ర ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మరోసారి ఎంఢీఆర్ విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది.

ADVERTISEMENT

వివరాలు

సామాన్యులకు ప్రభావం ఉండదా?

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సవరణ వల్ల సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచారం.

వ్యక్తి నుంచి వ్యక్తికి (Person-to-Person) జరిగే యూపీఐ లావాదేవీలు, అలాగే చిన్న వ్యాపారులకు చేసే చెల్లింపులు ఇప్పటిలాగే ఉచితంగానే కొనసాగనున్నాయి.

ప్రధానంగా పెద్ద వ్యాపార సంస్థలకే ఈ మార్పు వర్తించే అవకాశం ఉంది.

పెద్ద వ్యాపారుల నుంచి వసూలు చేసే రుసుములను యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వినియోగించాలని కేంద్రం భావిస్తోంది. యూపీఐ నిర్వహణ, సాంకేతిక మౌలిక వసతుల అభివృద్ధి, సేవల విస్తరణ కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు.

ADVERTISEMENT