LOADING...
RBI: ఆన్‌లైన్ మోసానికి గురయ్యారా?.. రూ.25 వేల వరకు పరిహారం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం!
ఆన్‌లైన్ మోసానికి గురయ్యారా?.. రూ.25వేల వరకు పరిహారం..ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

RBI: ఆన్‌లైన్ మోసానికి గురయ్యారా?.. రూ.25 వేల వరకు పరిహారం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్ లావాదేవీల్లో ఒక తప్పు లింక్‌పై క్లిక్ చేసినా, నకిలీ కేవైసీ అప్‌డేట్ పేరుతో మోసగాళ్ల వలలో చిక్కుకున్నా బ్యాంకు ఖాతాలోని డబ్బు క్షణాల్లో మాయమవుతోంది. ఇలాంటి సందర్భాల్లో కోల్పోయిన డబ్బు తిరిగి వస్తుందనే ఆశ చాలా మంది బాధితుల్లో ఉండేది కాదు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌ బి ఐ) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మోసాల బాధితులకు ఊరట కల్పించడంతో పాటు బ్యాంకుల బాధ్యతను మరింత పెంచేలా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

వివరాలు 

గరిష్ఠంగా రూ.25 వేల వరకు పరిహారం పొందే అవకాశం

దేశవ్యాప్తంగా యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డిజిటల్ మోసాలకు గురైన వినియోగదారులకు ఆర్థిక రక్షణ కల్పించే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం, అనుమతి లేకుండా జరిగిన డిజిటల్ లావాదేవీని గుర్తించిన తర్వాత ఐదు రోజుల్లోగా సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే,విచారణ అనంతరం నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠంగా రూ.25 వేల వరకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఎలాంటి మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించనుంది.

వివరాలు 

బ్యాంకులు అంతర్గత రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి 

అయితే పరిహారం ఇవ్వడమే ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశం కాదు. డిజిటల్ మోసాలు జరగకముందే వాటిని అడ్డుకునే చర్యలపై కూడా ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం బ్యాంకులు తమ అంతర్గత రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత వ్యవస్థల వినియోగంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానాలు పాటించేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ రెండు అంశాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం,మోసపూరిత కార్యకలాపాలను ముందుగానే పసిగట్టడం, కస్టమర్ల ఖాతాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడం వంటి పనుల్లో బ్యాంకులు ప్రస్తుతం ఏఐ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

వ్యవస్థలను సమర్థంగా నిర్వహిస్తే..

ఈ వ్యవస్థలను సమర్థంగా నిర్వహిస్తే వినియోగదారులు డబ్బు కోల్పోయే ముందే మోసాలను గుర్తించి అడ్డుకునే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఈ అంశంపై ఈవై ఇండియా భాగస్వామి, ఫైనాన్షియల్ సర్వీసెస్ రిస్క్ మేనేజ్‌మెంట్ లీడర్ అజయ్ సిరికొండ స్పందిస్తూ, ఏఐ సంబంధిత ప్రమాదాలను ఎలా నిర్వహించాలనే విషయంలో భారతీయ బ్యాంకులకు ఆర్‌బీఐ స్పష్టమైన మార్గదర్శకాలను అందించిందన్నారు. వినియోగదారుల రక్షణ, థర్డ్ పార్టీ ఏఐ మోడల్స్ వినియోగం వంటి కీలక అంశాలను ఒకే విధానంలో పొందుపరచడం ద్వారా ఈ మార్గదర్శకాలు అమెరికా, యూకే నియంత్రణ సంస్థల విధానాల కంటే ముందున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

వివరాలు 

డిజిటల్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా.. బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి

ఇప్పటివరకు ఏఐ వినియోగంపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడం వల్ల బ్యాంకులు అనేక సందేహాలు ఎదుర్కొన్నాయని,తాజా మార్గదర్శకాలతో ఆఅనిశ్చితి తొలగిపోయిందని ఆయన తెలిపారు. ఈ నిబంధనలు ఏఐ వినియోగాన్నిపరిమితం చేయడానికి కాకుండా,మరింత వేగంగా,సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడతాయని అజయ్ సిరికొండ పేర్కొన్నారు. వినియోగదారుల పరంగా చూస్తే ఈ కొత్త నిబంధనలతో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే. డిజిటల్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే,కోల్పోయిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. బాధితులు సకాలంలో స్పందించడం,బ్యాంకులు అత్యాధునిక సాంకేతికతతో మోసాలను అడ్డుకోవడం అనే ఈ రెండు చర్యలు సమర్థంగా అమలైతేనే దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత భద్రంగా మారుతుంది.

Advertisement