Passport: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి పూర్తి ఆధారం కాదు: కేంద్రం సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పాస్ పోర్ట్ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం నిరూపితమైనట్లు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారతీయ పాస్‌పోర్ట్ అనేది విదేశీ ప్రయాణాల కోసం జారీ చేసే అధికారిక ప్రయాణ పత్రం మాత్రమేనని, దానిని పౌరసత్వానికి పూర్తి స్థాయి ఆధారంగా పరిగణించలేమని వెల్లడించింది. 14వ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.
వివరాలు
పాస్‌పోర్ట్‌తో పౌరసత్వం నిరూపించవచ్చా?
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగించబడిన వారు తమ పౌరసత్వాన్ని నిరూపించడానికి పాస్‌పోర్ట్‌ను ఆధారంగా చూపించవచ్చా అని మీడియా ప్రశ్నించగా.. దానికి స్పందించిన అధికారి కీలక వివరణ ఇచ్చారు. విదేశాల్లో ఒక వ్యక్తి జాతీయతను తెలియజేయడానికి పాస్‌పోర్ట్ ఉపయోగపడుతుందని, అయితే అది పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారిక ధ్రువపత్రం కాదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన వ్యాఖ్యలు కేంద్రం చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివరాలు
ఏ పత్రానికీ పూర్తి స్థాయి పౌరసత్వ గుర్తింపు లేదు
"పాస్‌పోర్ట్ పౌరసత్వానికి ఆధారం కాకపోతే, దాన్ని జారీ చేసే ముందు పోలీసులు ఎందుకు పూర్తిస్థాయి వెరిఫికేషన్ నిర్వహిస్తారు? భారతీయులు కాని వ్యక్తులకు కూడా భారత్ పాస్‌పోర్ట్‌ను ప్రయాణ పత్రంగా ఇస్తుందా? ఇలాంటి ప్రకటనలతో విదేశాల్లో భారత పాస్‌పోర్ట్ చట్టబద్ధతపై సందేహాలు తలెత్తే అవకాశం ఉంది" అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా విమర్శించారు. సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శి జారీ చేసే ధ్రువపత్రాలు ఏవీ కూడా భారత పౌరసత్వానికి తుది ఆధారాలుగా పరిగణించబడవు. ఇవి కేవలం వ్యక్తిగత గుర్తింపు లేదా నివాస ధ్రువీకరణకు మాత్రమే ఉపయోగపడతాయి.
వివరాలు
ఈ-పాస్‌పోర్ట్‌లపై కేంద్రం కీలక వివరాలు
విదేశాల నుంచి భారత పౌరసత్వం పొందిన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా'సిటిజన్‌షిప్ సర్టిఫికెట్' జారీ చేస్తుంది. అయితే భారతదేశంలో జన్మించిన పౌరులకు అలాంటి ప్రత్యేక పౌరసత్వ ధ్రువపత్రం ఉండదని అధికారులు వివరించారు. అదే కార్యక్రమంలో పాస్‌పోర్ట్ సేవల్లో చోటుచేసుకున్న సాంకేతిక పురోగతిని కూడా కేంద్రం వెల్లడించింది. బయోమెట్రిక్ సమాచారంతో కూడిన,నకిలీలను అడ్డుకునే చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ వేగంగా కొనసాగుతోందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 1.47కోట్ల ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ చేసినట్లు వెల్లడించింది. అలాగే గత పదేళ్లలో దేశంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్య 77నుంచి 545కు పెరిగిందని పేర్కొంది. దీంతో పోలీసు వెరిఫికేషన్‌కు పట్టే సమయాన్ని మినహాయిస్తే,కేవలం ఆరు పని దినాల్లోనే పాస్‌పోర్ట్‌ను అందించే స్థాయికి సేవలను విస్తరించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.