Oil Prices: యుద్ధానికి ముందు స్థాయికి ముడిచమురు ధరలు.. బ్యారెల్‌కు 72 డాలర్లకు చేరిన బ్రెంట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల సమయంలో పెరిగిన ముడిచమురు ధరలు ఇప్పుడు మళ్లీ యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి చేరుకున్నాయి. సరఫరా పరిస్థితులు మెరుగుపడడం, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వరుసగా తగ్గుతున్నాయి. గురువారం బ్రెంట్ క్రూడ్ ధర 1.52 శాతం తగ్గి బ్యారెల్‌కు సుమారు 72.4 డాలర్లకు చేరుకుంది. మరోవైపు అమెరికా ప్రమాణ ముడిచమురు అయిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర 1.43 శాతం పడిపోయి బ్యారెల్‌కు సుమారు 69.3 డాలర్లకు చేరింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లోనే బ్రెంట్ క్రూడ్ దాదాపు 4 శాతం క్షీణించడంతో, అమెరికా-ఇరాన్ ఘర్షణ ప్రారంభానికి ముందు నమోదైన ముగింపు ధర స్థాయికి చేరుకుంది.
వివరాలు
ఇంకా క్లిష్టంగానే అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు
ఈ ఏడాది ప్రారంభంలో భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు క్రమంగా చల్లబడుతుండటంతో ట్రేడర్లు అప్పటి అదనపు ధరలను వెనక్కి తీసుకుంటున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ఇంకా క్లిష్టంగానే ఉన్నప్పటికీ, తొలి విడత చర్చల అనంతరం రెండు దేశాలు పురోగతి సాధించినట్లు సంకేతాలు ఇవ్వడంతో దీర్ఘకాలిక పరిష్కారం దిశగా ఆశలు పెరిగాయి. ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనడానికి మరో సంకేతంగా హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లు తమ ట్రాకింగ్ వ్యవస్థలను ఆన్‌లో ఉంచి సాధారణంగా రాకపోకలు సాగిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా అంతరాయం ఏర్పడిన సముద్ర రవాణా ఇప్పుడు మళ్లీ సాధారణ స్థితికి వస్తోందని ఇది సూచిస్తోంది.
వివరాలు
క్రమంగా పెరుగుతున్న ముడిచమురు సరఫరా
ఇక ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా కూడా క్రమంగా పెరుగుతోంది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల ఉత్పత్తిదారులు కొనుగోలుదారులకు మరిన్ని చమురు కార్గోలను అందించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో యుద్ధ సమయంలో నెలకొన్న సరఫరా కొరతపై ఉన్న ఆందోళనలు తగ్గుతున్నాయి. ఈ మార్పు భౌతిక చమురు మార్కెట్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సమీపకాల సరఫరా-డిమాండ్ పరిస్థితులను అంచనా వేసే కీలక సూచిక అయిన బ్రెంట్ ప్రాంప్ట్ టైమ్‌స్ప్రెడ్ ప్రస్తుతం కాంటాంగో స్థితిలోకి మారింది. అంటే భవిష్యత్ డెలివరీ ధరలు ప్రస్తుత స్పాట్ ధరల కంటే ఎక్కువగా ఉండటం. దీనివల్ల తక్షణ సరఫరాపై ట్రేడర్ల ఆందోళన తగ్గినట్లు మార్కెట్ సంకేతాలు ఇస్తోంది.
వివరాలు
కుషింగ్ కేంద్రంలో ప్రస్తుతం సుమారు 1.9కోట్ల బ్యారెళ్లు
అదనంగా,అమెరికా ప్రభుత్వం తాత్కాలిక మినహాయింపు ఇవ్వడంతో ఇప్పటికే లోడ్ చేసిన ఇరాన్ చమురును కొనుగోలు చేసే అవకాశం లభించింది. అయితే ఆర్థికలావాదేవీలు,బీమా పరిమితులు ఇంకా కొనసాగుతున్నప్పటికీ,ఈ నిర్ణయం మార్కెట్లో కొంత అదనపు చమురు అందుబాటులోకి రావడానికి దోహదపడనుంది. అయితే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరిందని భావించకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం సమయంలో ఏర్పడిన సరఫరా అంతరాయాన్ని ప్రధానంగా నిల్వల్లో ఉన్న చమురును వినియోగించడం ద్వారా అధిగమించారు. ముఖ్యంగా అమెరికాలోని ఒక్లాహోమా రాష్ట్రంలోని కుషింగ్ కేంద్రంలో ఉన్న ముడిచమురు నిల్వలు ప్రస్తుతం సుమారు 1.9కోట్ల బ్యారెళ్లకు పడిపోయాయి. ఇది మార్కెట్ సజావుగా కొనసాగేందుకు అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉండటంతో, భవిష్యత్తులో సరఫరాపై మరోసారి ఒత్తిడి ఏర్పడే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు.