Jeff Bezos: జెఫ్ బెజోస్ ఏఐ స్టార్టప్‌కు భారీ ఫండింగ్.. 12 బిలియన్ డాలర్లు సమీకరణ!
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో మరో భారీ పెట్టుబడి నమోదైంది. ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త 'జెఫ్ బెజోస్' సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఫిజికల్ ఏఐ స్టార్టప్ 'ప్రోమీథియస్ (Prometheus)' తాజాగా తన రెండో ఫండింగ్ రౌండ్‌లో 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1 లక్ష కోట్లకు పైగా) సమీకరించింది. ఈ తాజా పెట్టుబడులతో కంపెనీ విలువ ఏకంగా '41 బిలియన్ డాలర్లకు' చేరింది. ఈ పెట్టుబడి రౌండ్‌లో జెఫ్ బెజోస్ స్వయంగా పాల్గొనడమే కాకుండా, ప్రపంచ ప్రముఖ ఆర్థిక సంస్థలు 'JPMorgan Chase, 'Goldman Sachs', 'BlackRock' కూడా పెట్టుబడులు పెట్టాయి.
వివరాలు
గతేడాది ప్రారంభమైన ప్రోమీథియస్
ప్రోమీథియస్ సంస్థ గతేడాది చివర్లో ప్రారంభమైంది. ప్రారంభ దశలోనే కంపెనీ 6.2 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించి టెక్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రెండో విడతలో మరింత భారీ పెట్టుబడులు రాబట్టి తన స్థాయిని మరింత పెంచుకుంది. 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంజనీర్' లక్ష్యం ప్రోమీథియస్ ప్రధానంగా 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంజనీర్' అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై పనిచేస్తోంది. ఈ సాంకేతికత ద్వారా సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థల రూపకల్పన, తయారీ ప్రక్రియలను ఆటోమేట్ చేయాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. జెట్ ఇంజిన్లు, ఔషధ సమ్మేళనాలు వంటి క్లిష్టమైన ఉత్పత్తుల డిజైన్, తయారీ పనులను కూడా భవిష్యత్తులో ఏఐ నిర్వహించేలా చేయాలని కంపెనీ యోచిస్తోంది.
వివరాలు
ఉద్యోగాలపై బెజోస్ భిన్న అభిప్రాయం
ఇంజనీరింగ్ రంగంలో ప్రస్తుతం మనుషులు చేస్తున్న అనేక పనులను క్రమంగా ఏఐ చేపట్టే స్థాయికి తీసుకెళ్లడం సంస్థ దీర్ఘకాలిక లక్ష్యంగా పేర్కొంటోంది. ఏఐ కారణంగా భవిష్యత్తులో ఉద్యోగాలు భారీగా తగ్గిపోతాయని చాలా మంది టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నాయి. అయితే జెఫ్ బెజోస్ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వల్ల ఉత్పాదకత గణనీయంగా పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు సంపాదించే కుటుంబాలు భవిష్యత్తులో ఒక్కరి ఆదాయంతోనే సౌకర్యవంతంగా జీవించగలవని, అదనపు పని గంటలు చేసే అవసరం కూడా తగ్గవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏఐ అభివృద్ధి కారణంగా భవిష్యత్తులో 'లేబర్ స్కార్సిటీ' (కార్మికుల కొరత) పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా విస్తరణ
ప్రస్తుతం ప్రోమీథియస్ సంస్థలో సుమారు 150 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంస్థ కార్యకలాపాలు 'San Francisco', లండన్, జ్యూరిచ్ నగరాల్లో కొనసాగుతున్నాయి. సంస్థ ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులపై పూర్తి వివరాలను వెల్లడించకపోయినా, కొత్తగా సమీకరించిన నిధుల్లో గణనీయమైన భాగాన్ని భారీ కంప్యూటింగ్ సామర్థ్యాల కోసం వినియోగించనున్నట్లు బెజోస్ సంకేతాలు ఇచ్చారు.
వివరాలు
ఫిజికల్ ఏఐపై పెట్టుబడిదారుల దృష్టి
ప్రస్తుతం ఫిజికల్ ఏఐ రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే సామర్థ్యం ఉండటంతో ఈ రంగాన్ని కేవలం సాఫ్ట్‌వేర్ ఆధారిత ఏఐ కంటే మరింత బలమైన వ్యాపార అవకాశంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రోమీథియస్ వంటి సంస్థలు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, భవిష్యత్ సాంకేతిక రంగానికి కొత్త దిశను చూపుతున్నాయి.