Loading...
Venezuela: వెనెజువెలా నుంచి భారత్‌కు భారీగా చమురు.. ఇరాక్‌, అమెరికాను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి!
వెనెజువెలా నుంచి భారత్‌కు భారీగా చమురు.. ఇరాక్‌, అమెరికాను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి!

Venezuela: వెనెజువెలా నుంచి భారత్‌కు భారీగా చమురు.. ఇరాక్‌, అమెరికాను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హర్మూజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణాకు ఎదురవుతున్న అంతరాయాల నేపథ్యంలో ఇండియా లాటిన్‌ అమెరికా దేశాల నుంచి ముడి చమురు దిగుమతులను పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆగస్టులో వెనెజువెలా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయి. దీంతో దక్షిణ అమెరికాకు చెందిన వెనెజువెలా భారత్‌కు నాలుగో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా అవతరించింది. కెప్లర్‌ షిప్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం.. ఆగస్టులో వెనెజువెలా నుంచి భారత్‌ రోజుకు సుమారు 4,44,000 బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. దీంతో ఇరాక్‌ నుంచి రోజుకు 1,18,000 బ్యారెళ్లు, అమెరికా నుంచి 1,53,000 బ్యారెళ్ల దిగుమతులను వెనెజువెలా అధిగమించింది.

వివరాలు

ఏప్రిల్‌ నుంచి పెరిగిన వెనెజువెలా వాటా

ఏప్రిల్‌లో వెనెజువెలా నుంచి భారత్‌ ముడి చమురు దిగుమతులను తిరిగి ప్రారంభించినప్పటి నుంచి సరఫరాదారుల జాబితాలో ఆ దేశం స్థానం వేగంగా పెరిగింది.

పశ్చిమాసియా దేశాల నుంచి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో భారత రిఫైనరీలు వెనెజువెలా, బ్రెజిల్‌, ఆఫ్రికా దేశాల నుంచి కొనుగోళ్లను పెంచాయి.

అదే సమయంలో రష్యా చమురుపై ఆధారపడటాన్ని కూడా భారత్‌ కొనసాగిస్తోంది. ఆగస్టులో రష్యా రోజుకు దాదాపు 2 మిలియన్‌ బ్యారెళ్ల చమురును భారత్‌కు సరఫరా చేస్తూ అగ్రస్థానంలో కొనసాగింది.

జూన్‌, జులై నెలల్లో రష్యా నుంచి భారత్‌ రోజుకు సుమారు 2.6 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది భారత్‌ మొత్తం ముడి చమురు వినియోగంలో సగానికి పైగా కావడం గమనార్హం.

వివరాలు

సరఫరా అంతరాయాలకు రక్షణ కవచం

పశ్చిమాసియా నుంచి చమురు సరఫరా మార్గాల్లో ఏర్పడే అంతరాయాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి సరఫరా వనరులను విస్తరించడం భారత్‌కు కొంత రక్షణ కవచంలా పనిచేస్తోంది.

దేశీయంగా సాధ్యమైనంత మేర చమురు ఉత్పత్తిని పెంచడం, విదేశీ ముడి చమురు సరఫరాదారులు, రవాణా మార్గాలను వైవిధ్యపరచడం, వ్యూహాత్మక, వాణిజ్య చమురు నిల్వలను అభివృద్ధి చేయడంతో పాటు గ్యాస్‌, బయో ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని వేగవంతం చేయడం వంటి పలు వ్యూహాలను భారత్‌ ఒకేసారి అమలు చేస్తోందని కెప్లర్‌ సీనియర్‌ మేనేజర్‌ సుమిత్‌ రిటోలియా తెలిపారు.

అయితే గల్ఫ్‌ దేశాలతో పోలిస్తే వెనెజువెలా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు భారత్‌కు భౌగోళికంగా చాలా దూరంగా ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

పెరుగుతున్న బీమా ఖర్చులు

దీంతో చమురు రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు రిఫైనరీలకు రవాణా, బీమా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.

అందువల్ల ప్రత్యామ్నాయ చమురు మార్కెట్లు అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఏర్పడే సరఫరా అంతరాయాల నుంచి భారత్‌ను కొంతవరకు రక్షించగలిగినా.. మరోవైపు దేశ చమురు దిగుమతి బిల్లును గణనీయంగా పెంచే అవకాశం ఉందని సుమిత్‌ రిటోలియా విశ్లేషించారు.

ADVERTISEMENT