లే ఆఫ్స్: 251మంది ఉద్యోగులను తొలగించిన ఈ కామర్స్ సంస్థ మీషో
ప్రస్తుతం అంతటా లే ఆఫ్స్ కాలం నడుస్తోంది. సడెన్ గా ఉద్యోగాల్లోంచి తొలగించడం ఎక్కువైపోయింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో, 251మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం 251మందికి లే ఆఫ్స్ మెయిల్స్ వెళ్ళిపోయాయి. 251మంది అంటే దాదాపు మీషో కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 15శాతం అన్నమాట. మీషో ఇలా ఉద్యోగులను తొలగించడం ఈ సంవత్సరంలో ఇది రెండవ సారి. క్రితంసారి కూడా 250మంది ఉద్యోగులకు ఉద్వాసన పత్రాలు అందించింది. లే ఆఫ్స్ గురించి వెల్లడించిన మీషో సీఈవో విదిత్ ఆత్రే, దానికి గల కారణాలను కూడా తెలియజేసాడు.
సీఈవో వెల్లడి చేసిన కారణాలు
ఉద్యోగులను తీసుకునే విషయాల్లో జరిగిన పొరపాట్లు, అలాగే వారితో పని చేయించుకునే విషయంలో జరిగిన ఇబ్బందుల కారణంగా ఉద్వాసన పలకాల్సి వచ్చిందని అన్నాడు సీఈవో. అంతేకాదు, మీషో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటిని మెరుగు పర్చడానికి సమయం పడుతుందని అన్నాడు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు 2.5-9నెలల జీతాన్ని నష్ట పరిహారాన్ని ఇస్తామని మీషో తెలియజేసింది. ఫ్యామిలీ ఇన్స్యూరెన్స్ మాత్రం 2024 మార్చ్ 31 వరకు చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగం కోల్పోయిన వారికి అండగా ఉంటామని, కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి తమవంతు సహాకరం అందిస్తామని వెల్లడి చేసింది.