Telangana: రికార్డు స్థాయిలో పెరిగిన కరెంటు డిమాండ్.. డిస్కంలపై పెరుగుతున్న ఒత్తిడి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరా కొనసాగించాలనే లక్ష్యంతో విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం పెరుగుతోంది. ప్రభుత్వానికి చెందిన విద్యుదుత్పత్తి ప్లాంట్ల నుంచి వస్తున్న విద్యుత్ సరిపోకపోవడంతో, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌లో రోజుకు సగటున 4 కోట్ల యూనిట్ల కరెంటు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెల జనవరిలో మాత్రమే డిస్కంలు 120.70 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను బయట నుంచి కొనుగోలు చేసి, ఇందుకోసం అదనంగా రూ.481 కోట్లను ఖర్చు చేశాయి. ఈ నెలలోనూ కొనుగోళ్ల వ్యయం రూ.500 కోట్లకు మించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
జనవరి 23న 16,048 మెగావాట్ల డిమాండ్ నమోదు
ఈ నెల 6వ తేదీన రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 16,183 మెగావాట్లకు చేరింది. ఇదే ఏడాది జనవరి 23న కూడా 16,048 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గత ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకూ ఈ స్థాయిలో, అంటే 16 వేల మెగావాట్లకు మించి, రోజువారీ డిమాండ్ ఒక్కరోజు కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 18 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో, డిస్కంలు ముందుగానే కొనుగోలు, సరఫరా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
వివరాలు
విద్యుత్ వినియోగం పెరగడానికి కారణం
విద్యుత్ వినియోగం ఇలా పెరగడానికి ప్రధాన కారణంగా ఈ రబీ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం పెరగడమేనని డిస్కంల ఇంజినీర్లు చెబుతున్నారు. సాగు అవసరాల కోసం వ్యవసాయ బోర్లు నిరంతరం నడుస్తుండటంతో కరెంటు వినియోగం భారీగా పెరిగిందని వారు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, గృహ వినియోగంలో కూడా గతేడాదితో పోలిస్తే 8 శాతానికి పైగా వృద్ధి నమోదైనట్లు అంచనా. రాష్ట్ర జెన్‌కో ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.5కుపైగా ఖర్చు అవుతుండగా, ఎక్స్ఛేంజ్‌లో సగటున రూ.3.50లోపే లభిస్తుండటంతో అక్కడినుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నామని డిస్కంలు ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం.
వివరాలు
విద్యుత్ ఉద్యోగుల వేతనాల నిలిపివేత
అయితే, ఎక్స్ఛేంజ్‌లో విద్యుత్ కొనాలంటే ఒకరోజు ముందే నగదు చెల్లించాల్సి ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నిధులు సమకూర్చేందుకు ఈ నెల 4వ తేదీ వరకు డిస్కంలు విద్యుత్ ఉద్యోగుల వేతనాల్ని కూడా నిలిపివేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, రాయితీల ఖాతాలో ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2 వేల కోట్లకు పైగా నిధులను వెంటనే విడుదల చేస్తేనే బయట నుంచి కరెంటు కొనుగోలు చేయగలమని డిస్కంలు తాజాగా ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.