LOADING...
Telangana: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న వేడి.. సాధారణం కంటే 3.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న వేడి.. సాధారణం కంటే 3.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు

Telangana: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న వేడి.. సాధారణం కంటే 3.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వర్షాలు పెద్దగా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. శుక్రవారం పలు జిల్లాల్లో సాధారణం కంటే 2.5 నుంచి 3.6 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా వానాకాలంలో ఉష్ణోగ్రతలు సగటుతో పోలిస్తే మూడు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతుంటాయి. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో పగటి వేడి పెరిగినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో సాధారణంగా 32.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కావాల్సి ఉండగా, 3.6 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీలు నమోదయ్యాయి.

వివరాలు 

ద్రోణి ప్రభావంతో శనివారం,ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

నిజామాబాద్‌లో సాధారణ ఉష్ణోగ్రత 31.9 డిగ్రీలు ఉండగా 3.5 డిగ్రీలు పెరిగింది. హైదరాబాద్‌లో 31.5 డిగ్రీలకు 3.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 32.1 డిగ్రీలకు 3.2 డిగ్రీలు, రామగుండంలో 32.6 డిగ్రీలకు 2.6 డిగ్రీలు అధికంగా నమోదై 35.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, తెలంగాణ నుంచి కర్ణాటక సమీపంలోని సముద్ర తీరాన్ని ఆనుకుని తూర్పు-మధ్య అరేబియా సముద్రం వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

వివరాలు 

గరిడేపల్లిలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం

మరోవైపు, శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో అత్యధికంగా 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కామారెడ్డి గూడెంలో 4 సెంటీమీటర్లు, వేములపల్లిలో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పలు గ్రామాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.

Advertisement