US: అమెరికాలో విజయవాడ యువతి హత్య.. డిజిటల్ ఆధారాలతో భర్త అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
వివాహం జరిగిన ఐదు నెలలకే అమెరికాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విజయవాడకు చెందిన తెలుగు యువతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. దాదాపు ఎనిమిది నెలల పాటు సాగిన దర్యాప్తు అనంతరం ఆమె భర్తే హత్య చేసినట్లు అమెరికా పోలీసులు నిర్ధారించారు. ఇండియాలో ఉన్న మరో మహిళతో ఉన్న సంబంధం కారణంగానే భార్యను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు, హత్య అనంతరం భార్య మృతదేహం ఫోటోలను కూడా ఆ మహిళకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు.
వివరాలు
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
తమ కుమార్తెను భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని ఎప్పుడూ చెప్పేదని, అదే ప్రేమ చివరకు ఆమె ప్రాణాలు తీస్తుందని ఎన్నడూ ఊహించలేదని రజిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం అమెరికా పోలీసులు రజిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఆమె అనారోగ్యంతో కాకుండా హత్యకు గురైందని, ఈ కేసులో మీ అల్లుడే నిందితుడని తెలియజేశారు. ఈ సమాచారం విన్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే అమెరికాకు వెళ్లారు.
వివరాలు
సహజ మరణంగా చూపించే ప్రయత్నం
విజయవాడ గాయత్రీనగర్‌కు చెందిన వ్యాపారి సబ్బినేని కృష్ణారావుకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె రజిత (27) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది. ఆమెకు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నార్నె అవినాష్‌తో 2025 జూన్ 5న విజయవాడలో వివాహం జరిగింది. అనంతరం ఇద్దరూ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం బెల్‌వ్యూ నగరంలో నివాసం ఏర్పరుచుకున్నారు. అయితే 2025 అక్టోబర్ 27న రజిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. భార్య బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుందని, ఎంత పిలిచినా స్పందించడం లేదంటూ అవినాష్ అత్యవసర సేవల నంబర్ 911కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని బాత్రూమ్ తలుపు పగులగొట్టి చూడగా రజిత అపస్మారక స్థితిలో కనిపించింది.
వివరాలు
హత్యకు ముందే పక్కా ప్రణాళిక
ఆరోగ్యం బాగోలేక దగ్గు మందు తాగి పడిపోయి ఉండొచ్చని అవినాష్ పోలీసులకు చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ సమాచారం తెలుసుకున్న రజిత తల్లిదండ్రులు అమెరికా వెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. దర్యాప్తులో అవినాష్ హత్యకు ముందే పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. శరీరంలోకి విషం ఎలా చేరుతుంది, పోస్టుమార్టంలో అది ఎలా బయటపడుతుంది, గొంతు నులిమితే ఎంత సమయంలో మరణం సంభవిస్తుంది వంటి అంశాలపై అతడు ఇంటర్నెట్‌లో శోధించిన వివరాలు డిజిటల్ ఫోరెన్సిక్ విచారణలో బయటపడ్డాయి.
వివరాలు
పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చిన అసలు నిజం
ఇక కొంతకాలంగా భర్త తయారు చేసి ఇచ్చే జ్యూస్‌లు అసాధారణంగా చేదుగా ఉంటున్నాయని రజిత తన స్నేహితురాలితో జరిగిన చాట్‌లో ప్రస్తావించింది. మరణించిన రోజు కూడా జ్యూస్ దగ్గు మందులా చేదుగా ఉందంటూ అవినాష్‌కు ఆమె మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన అమెరికా పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే రజిత మృతి చెందినట్లు వైద్య నివేదికలో స్పష్టమైంది. దీంతో పోలీసులు హత్య కోణంలో విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో అవినాష్‌కు ఇండియాలో మరో మహిళతో వివాహానికి ముందే సంబంధం ఉన్నట్లు తేలింది.
వివరాలు
స్మార్ట్ లాక్, సీసీ ఫుటేజీతో బయటపడిన నిజం
రజిత-అవినాష్ వివాహానికి కూడా ఆ మహిళ హాజరైనట్లు గుర్తించారు. భార్య మృతదేహం ఫోటోలను ఆమెకు పంపినట్లు డిజిటల్ ఆధారాలు వెల్లడించాయి. విచారణలో భాగంగా పోలీసులు ఇంట్లోని స్మార్ట్ లాక్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని అవినాష్ చెప్పినా, సాంకేతిక ఆధారాలు మాత్రం అతడు అప్పట్లో ఇంట్లోనే ఉన్నట్లు స్పష్టం చేశాయి.
వివరాలు
పక్కా ఆధారాలతో అరెస్ట్
దాదాపు ఎనిమిది నెలల పాటు సాగిన దర్యాప్తు అనంతరం అమెరికా పోలీసులు అవినాష్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని భావించిన కోర్టు 5 మిలియన్ డాలర్ల భారీ బెయిల్ విధించింది. అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేక ప్రస్తుతం అతడు జైలులోనే ఉన్నాడు.