LOADING...
Telangana: ఆధార్‌ ధ్రువీకరణతో.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు.. కేంద్రం కొత్త గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ
కేంద్రం కొత్త గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

Telangana: ఆధార్‌ ధ్రువీకరణతో.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు.. కేంద్రం కొత్త గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగడం,గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన యజమానులు,డ్రైవర్లు,రవాణా సంస్థలకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. ఆధార్ ధ్రువీకరణ ఆధారంగా 100 రవాణా సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా తెలంగాణ రవాణాశాఖ కూడా దశలవారీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొదటి దశలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయ పరిధిలో పైలట్ ప్రాజెక్టును వారం రోజుల్లో ప్రారంభించనున్నారు. ఇందులో ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లు,వాటికి సంబంధించిన పలు సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

వివరాలు 

100 సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి

అనంతరం ఒకటి నుంచి రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. పరివాహన్,సారథి, ఈ-చలాన్ పోర్టళ్ల ద్వారా ఆధార్ ధ్రువీకరణతో మొత్తం 100 సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆధార్ లేని వారు ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలతో సంబంధిత రవాణాశాఖ కార్యాలయాల్లో సేవలు పొందే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికే కార్లు, ద్విచక్రవాహనాలు వంటి వ్యక్తిగత (నాన్-ట్రాన్స్‌పోర్ట్) కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు షోరూమ్‌ల ద్వారానే ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆటోలు, లారీలు వంటి ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లు, వాటికి సంబంధించిన వివిధ సేవలతో పాటు నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు సంబంధించిన ఇతర సేవలను కూడా ఖైరతాబాద్ పరిధిలో వారంలోనే అమలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

వివరాలు 

ఏ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి?

రోడ్డు భద్రతకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు, వాహన ఫిట్‌నెస్ పరీక్షలు మాత్రం ఇప్పటిలాగే రవాణాశాఖ కార్యాలయాల్లోనే నిర్వహిస్తారు. ఈ సేవల కోసం వ్యక్తిగతంగా హాజరుకావడం తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన 23 సేవలను ఇటీవలే ఆన్‌లైన్‌లో ప్రారంభించినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్లు తదితర 100 సేవలను కేంద్రం తొమ్మిది విభాగాలుగా విభజించి అందుబాటులోకి తీసుకురానుంది.

Advertisement

వివరాలు 

డ్రైవింగ్ లైసెన్స్ సేవలు - 21

కొత్త డ్రైవింగ్ లైసెన్స్ జారీ, లైసెన్స్ రెన్యువల్, పేరు లేదా చిరునామా మార్పు, డూప్లికేట్ లైసెన్స్, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ జారీ, మొబైల్ నంబర్ మార్పు, స్మార్ట్ కార్డ్ సేవలు, లైసెన్స్ సరెండర్ వంటి 21 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ సర్వీస్ వెహికిల్ బ్యాడ్జ్ - 2 ఆటోలు, క్యాబ్‌లు వంటి ప్రజారవాణా వాహనాల డ్రైవర్లకు కొత్త బ్యాడ్జ్ జారీ, డూప్లికేట్ బ్యాడ్జ్ జారీ సేవలు ఆన్‌లైన్‌లో లభిస్తాయి. కండక్టర్ లైసెన్స్ సేవలు - 6 కండక్టర్ లైసెన్స్ జారీ, రెన్యువల్, పేరు లేదా చిరునామా మార్పు, డూప్లికేట్ లైసెన్స్, లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్ వంటి ఆరు సేవలను డిజిటల్ విధానంలో పొందవచ్చు.

Advertisement

వివరాలు 

వాహన రిజిస్ట్రేషన్ సేవలు - 39

కొత్త వాహన రిజిస్ట్రేషన్, పాత వాహన యాజమాన్య బదిలీ, తాత్కాలిక రిజిస్ట్రేషన్, డూప్లికేట్ ఆర్సీ, ఎన్వోసీ, పేరు లేదా చిరునామా మార్పు, హైపోథకేషన్ చేర్చడం లేదా తొలగించడం, మోటారు వాహన పన్ను రిఫండ్ తదితరంగా మొత్తం 39 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. పర్మిట్ సేవలు - 17 తాత్కాలిక పర్మిట్, స్టేజ్ క్యారేజ్, కాంట్రాక్ట్ క్యారేజ్, టూరిస్ట్ పర్మిట్, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్, నేషనల్ పర్మిట్, పర్మిట్ బదిలీ తదితర 17 సేవలు డిజిటల్ రూపంలో అందించనున్నారు. వాహన స్క్రాపింగ్ సేవలు - 3 వాహనాన్ని స్క్రాప్ చేయడానికి దరఖాస్తు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ పొందడం,ఆ సర్టిఫికెట్‌ను కొత్త వాహనం కొనుగోలుకు వినియోగించడం వంటి మూడు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

వివరాలు 

ఫిట్‌నెస్ సేవలు - 6

ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌లో ఫిట్‌నెస్ పరీక్షకు అపాయింట్‌మెంట్ బుకింగ్, తేదీ మార్పు, రద్దు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, వాహన ఫిట్‌నెస్ చరిత్ర, చెల్లింపుల వివరాలు వంటి ఆరు సేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మల్టీలేన్ ఫ్రీ ఫ్లో - 1 బకాయి యూజర్ ఫీజులను చెల్లించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ సేవ అందుబాటులో ఉంటుంది. ఈ-చలాన్ సేవలు - 5 చలాన్ స్థితి తెలుసుకోవడం, పెండింగ్ చలాన్ల చెల్లింపు, రసీదు డౌన్‌లోడ్, చలాన్‌పై ఫిర్యాదు నమోదు, ఫిర్యాదు స్థితి తెలుసుకోవడం వంటి ఐదు సేవలను కూడా ఇంటి నుంచే వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు.

Advertisement