NMC: ఏపీలో మరో 100 ఎంబీబీఎస్ సీట్లు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ గ్రీన్‌సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య విద్యలో మరో కీలక ముందడుగు పడింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 అదనపు ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్‌ఓపీ) జారీ చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి మొత్తం 100 అదనపు ఎంబీబీఎస్ సీట్లు లభించాయని, వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
వివరాలు
నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 200 సీట్లు
ఎన్‌ఎంసీ అనుమతి అనంతరం కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 175 నుంచి 250కు పెరగనుంది. అలాగే నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల సంఖ్య 175 నుంచి 200కు పెరగనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, అవసరమైన అధ్యాపక సిబ్బందిని నియమించడం, జాతీయ వైద్య కమిషన్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం వల్లే ఈ అనుమతులు లభించాయని వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ ఎ. విష్ణువర్ధన్ తెలిపారు.