Elon Musk: పదేళ్లలో చంద్రుడిపై మనుషుల నగరం?.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే పదేళ్లలోనే చంద్రుడిపై మనుషుల నగరం ఏర్పాటు చేసే దిశగా స్పేస్-X చురుగ్గా పని చేస్తోందని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రకటించారు. మంగళగ్రహంపై కాలనీ కట్టడానికంటే ఇది వేగంగా,వాస్తవికంగా సాధ్యమయ్యే ప్రాజెక్ట్ అని ఆయన తెలిపారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో,చంద్రుడిపై స్వయంగా విస్తరిస్తూ పెరిగే నగర నిర్మాణమే ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యమని ఎలాన్ మస్క్ వెల్లడించారు." ఇది పదేళ్లలోపే సాధ్యమవుతుందని, అదే మంగళగ్రహంపై పూర్తిస్థాయి నగరం ఏర్పాటుకు 20ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని వివరించారు. నాగరికత భవిష్యత్తును భద్రపరచే దిశగా చంద్రుడే ఇప్పుడు అనుకూల మార్గమని మస్క్ అభిప్రాయపడ్డారు. చంద్రుడికి ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రయోగం చేయొచ్చని, కేవలం రెండు రోజుల్లోనే ప్రయాణం పూర్తవుతుందని చెప్పారు.
వివరాలు
ఐదు నుంచి ఏడు ఏళ్లలో అక్కడ పనులు మొదలుపెట్టే యోచన
కానీ మంగళగ్రహానికి వెళ్లాలంటే గ్రహాల సరిపోలిక కోసం సుమారు 26 నెలలు ఎదురుచూడాల్సి వస్తుందని, ప్రయాణానికి ఆరు నెలలు పడుతుందని వివరించారు. అయితే మంగళగ్రహంపై మనుషుల కాలనీ ఏర్పాటు లక్ష్యం పూర్తిగా విరమించలేదని, వచ్చే ఐదు నుంచి ఏడు ఏళ్లలో అక్కడ పనులు మొదలుపెట్టే యోచన ఉందన్నారు. 2026 చివరికి మానవరహిత మంగళగ్రహ మిషన్ పంపాలన్న తన పాత లక్ష్యాన్ని గుర్తు చేస్తూనే, తాజా ప్రణాళికల్లో చంద్రుడికే ప్రాధాన్యం పెరిగినట్లు సంకేతాలిచ్చారు.
వివరాలు
అమెరికా-చైనా మధ్య అంతరిక్ష పోటీ
పెట్టుబడిదారులకు ముందుగా చంద్ర మిషన్లకే ప్రాధాన్యం ఇస్తామని స్పేస్‌ఎక్స్ తెలిపినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్న నేపథ్యంలో మస్క్ స్పష్టత ఇచ్చారు. 1972లో చివరి అపోలో మిషన్ తర్వాత ఇప్పటివరకు చంద్రుడిపై ఎవరూ అడుగుపెట్టలేదని, అమెరికా-చైనా మధ్య అంతరిక్ష పోటీ నేపథ్యంలో చంద్రుడు భవిష్యత్తు అంతరిక్ష ఆధిపత్యానికి ద్వారంగా మారుతున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. మానవాళిని బహుళ గ్రహజాతిగా మార్చాలన్న ఆలోచనను మస్క్ ఎప్పటినుంచో ప్రచారం చేస్తూ వస్తున్నారు.