US Teen: అమెరికాలో దారుణం.. తల్లి,తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల టీనేజర్ తన తల్లి, తమ్ముడిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని యాక్టన్ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అర్జున్ అరవింద్ అనే యువకుడు ఈ హత్యలకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో అతడి తల్లి సుధా వెంకటేశన్ (45), తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్ (14) మృతి చెందారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
తలుపు తీయకపోవడంతో అనుమానం
మిడిల్‌సెక్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ మరియన్ ర్యాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో ఇంట్లో ట్యూషన్ చెప్పేందుకు ఓ టీచర్ వచ్చారు. ఎంతసేపు తలుపు తట్టినా ఎవరూ స్పందించకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది.
వెంటనే అర్జున్ తండ్రికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవరూ స్పందించలేదు.
దీంతో ఆందోళనకు గురైన ఆయన.. ఇంట్లో పరిస్థితిని తెలుసుకోవాలని స్థానిక పోలీసులను సంప్రదించారు.
వివరాలు
రక్తపు మడుగులో తల్లి,తమ్ముడు
పోలీసులు ఇంటికి చేరుకుని పరిశీలించగా భయానక దృశ్యం కనిపించింది.
సుధా వెంకటేశన్ మృతదేహం బేస్‌మెంట్‌లో, సిద్ధార్థ్ మృతదేహం మొదటి అంతస్తులో కనిపించింది. ఇద్దరి శరీరాలపై తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన అనంతరం అర్జున్ కనిపించకుండా పోయాడు. అలాగే అతడి తల్లికి చెందిన హోండా అకార్డ్ కారు కూడా ఇంటి వద్ద కనిపించలేదు.
కారు సహా నిందితుడి అరెస్ట్
అర్జున్ కనిపించకపోవడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.
బుధవారం తెల్లవారుజామున వేలాండ్ ప్రాంతంలోని ఓ పార్కింగ్ స్థలంలో అతడిని గుర్తించారు.
అక్కడే అతడి తల్లి హోండా అకార్డ్ కారు కూడా కనిపించింది. దీంతో పోలీసులు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
చాట్‌జీపీటీ వినియోగంపై దర్యాప్తు
ఈ డబుల్ మర్డర్ కేసు దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అర్జున్ కొంతకాలంగా ఆందోళన కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కుటుంబ సభ్యులను హత్య చేయాలనే ఆలోచనలు, ఫాంటసీల కోసం అతడు ఇంటర్నెట్‌తో పాటు చాట్‌జీపీటీని ఉపయోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అధికారుల దర్యాప్తులో భాగంగా.. 'గోతిక్ నవల తరహా కథలు' రూపొందించేందుకు సాయం చేయాలని అర్జున్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను అడిగినట్లు గుర్తించారు.
అయితే ఈ సంభాషణలు హత్యలకు ఏ మేరకు సంబంధం కలిగి ఉన్నాయి అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
వివరాలు
పలు అభియోగాలు నమోదు
అర్జున్‌పై రెండు హత్య కేసులతో పాటు దాడి, వాహనం దొంగతనం తదితర పలు అభియోగాలను అధికారులు నమోదు చేశారు.
ప్రస్తుతం కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. హత్యలకు దారితీసిన కారణాలు, ఘటనకు ముందు నిందితుడి ప్రవర్తన, చాట్‌జీపీటీ వినియోగానికి సంబంధించిన అంశాలపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంట్లోనే తల్లి, తమ్ముడి హత్య.. 17 ఏళ్ల భారత సంతతి యువకుడి అరెస్ట్
Accused killer 17 year old Arjun Aravind of Acton was taken into custody in Wayland overnight and tomorrow he’s expected in adult court charged with murdering his mother and younger brother…his dad was at work when the murders took place #7News pic.twitter.com/ljpT6lNZGR
— Steve Cooper (@scooperon7) August 12, 2026