Chandrababu: పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపులో కొత్త విధానం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్పనిసరేనని, అయితే ప్రభుత్వం ఎంతవరకు ఆర్థికంగా భరించగలదన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం 20వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 25 ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2,08,406.16 కోట్ల పెట్టుబడులు ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.
వివరాలు
పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
వీటి ద్వారా 21,667 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయా సంస్థలు తమ ప్రతిపాదనల్లో వెల్లడించాయి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కొన్ని వర్గాలు కావాలనే ఆయా ప్రాజెక్టులను కాలుష్యకారకాలుగా ప్రచారం చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
రాజకీయంగా ఉపాధి లేని కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
వాస్తవాలను ప్రజలకు వివరించి, పరిశ్రమల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాలని సూచించారు.
వివరాలు
సెప్టెంబరు నాటికి 37 ఎంఎస్‌ఎంఈ పార్కులు పూర్తి
రాష్ట్రంలో మిగిలి ఉన్న 37 ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణాన్ని ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వివరాలు
20 ఎస్‌ఐపీబీల ద్వారా రూ.13.78 లక్షల కోట్ల పెట్టుబడులు
ఇప్పటివరకు నిర్వహించిన 20 ఎస్‌ఐపీబీ సమావేశాల ద్వారా 363 పెట్టుబడి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఈ ప్రతిపాదనల ద్వారా రాష్ట్రానికి రూ.13.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
వీటి ద్వారా 10.86 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
గత ఏడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు వేగంగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
పెట్టుబడుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వివరాలు
డేటా సెంటర్లకు 3.5 టీఎంసీల నీరు సరిపోతుంది
ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకు సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఉత్తరాంధ్రలో ఏర్పాటవుతున్న అన్ని డేటా సెంటర్లకు కలిపి 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని ఆయన వివరించారు.
నీటి వినియోగంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసి అనవసర ఆందోళనలకు తావులేకుండా చూడాలని సూచించారు.
వివరాలు
రక్షణ,ఏరోస్పేస్ రంగాలకు ప్రాధాన్యం
రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న రక్షణ రంగ ప్రాజెక్టులు జాతికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.
పుట్టపర్తి సమీపంలో రక్షణ రంగ ప్రాజెక్టులు, హిందూపురం సమీపంలో ఏరోస్పేస్ ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మూలపేట పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభించేందుకు వీలుగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
అలాగే రాయలసీమలో ఉత్పత్తి అయ్యే ఉద్యాన పంటలను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఇందుకోసం రహదారి, రైల్వే, పోర్టు కనెక్టివిటీని మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.