Telangana High Court : హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్.. సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
కోర్టుస్టే ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలోనే ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ చర్యలను సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు ఆయనకు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం..రెండువారాల్లోగా పూర్తి వివరణ సమర్పించాలని ఆదేశించింది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలంలోని వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలోని సర్వే నంబర్లు 194/1,211లో ఈ కూల్చివేతలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయా భూములకు సంబంధించి కోర్టుస్టే ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారన్న పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
వివరాలు
తమ ఆదేశాలు లేకుండానే కూల్చివేతలు జరిగాయన్న మేడ్చల్ కలెక్టర్
విచారణ సందర్భంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్‌తో పాటు మల్కాజిగిరి,తిరుమలగిరి తహసీల్దార్లు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.
కూల్చివేతలకు సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని మేడ్చల్ జిల్లా కలెక్టర్ న్యాయస్థానానికి తెలిపారు.
అంతేకాకుండా, తమ అనుమతి లేకుండానే మేడ్చల్ జిల్లాలో హైడ్రా సుమారు 40 కూల్చివేతలు చేపట్టిందని వివరించారు.
అయితే హైడ్రా తరఫు న్యాయవాది మరో వాదనను వినిపించారు.
రెవెన్యూ శాఖ సూచనల మేరకే చర్యలు తీసుకున్నామని, జీఎల్‌ఆర్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకే కూల్చివేతలు చేపట్టినట్లు కోర్టుకు వివరించారు.
ఈ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సంబంధిత రికార్డులను పూర్తిగా పరిశీలించకుండా ఏకపక్షంగా కూల్చివేతలకు పాల్పడటం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.
వివరాలు
కోర్టు స్టే వివరాలు హైడ్రాకు ఇవ్వాలని ఆదేశం
కోర్టు ఉత్తర్వులు, భూ రికార్డులు, సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా చర్యలు చేపట్టడం సరికాదని పేర్కొంది.
హైడ్రా పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల కలెక్టర్లు తమ వద్ద ఉన్న కోర్టు స్టే ఉత్తర్వుల వివరాలను వెంటనే హైడ్రాకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయాలని సూచించింది.
వివరాలు
ధిక్కరణ నోటీసులపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు
హైడ్రా ఏర్పాటుకు ముందే జారీ అయిన స్టే ఉత్తర్వులను కూడా ఆ సంస్థ పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పలు ఫిర్యాదులు అందుతున్నాయని ధర్మాసనం పేర్కొంది.
కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్పష్టం చేసింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు జారీ చేసిన ధిక్కరణ నోటీసులపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది.