Meta Layoffs: మెటాలో 8 వేల ఉద్యోగాల కోత.. జుకర్‌బర్గ్ కొత్త స్ట్రాటజీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
మెటా సంస్థలో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. కంపెనీ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ తాజాగా నిర్వహించిన తొలి త్రైమాసిక ఫలితాల సమావేశంలో భవిష్యత్ దిశను స్పష్టంగా వెల్లడించారు. మే 20న సుమారు 8 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇకపై చిన్న చిన్న AI ఆధారిత టీమ్‌లతోనే ఎక్కువ పనులు చేయించే విధానాన్ని మెటా అమలు చేయనుంది. ఒకటి లేదా ఇద్దరు ఉద్యోగులు AI టూల్స్ సహాయంతో గతంలో పెద్ద టీమ్‌లు నెలల తరబడి చేసిన పనిని వారం రోజుల్లో పూర్తి చేస్తున్నారని జుకర్‌బర్గ్ తెలిపారు. అందుకే అవసరానికి మించిన పెద్ద టీమ్‌లు ఉండవని స్పష్టం చేశారు.
వివరాలు
AI ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదు: జుకర్‌బర్గ్
ఇక మెటా ఈ ఏడాది AI మౌలిక వసతులపై రికార్డు స్థాయిలో 125 నుంచి 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయనుంది. డేటా సెంటర్లు,AI చిప్స్, మోడల్ ట్రైనింగ్‌పైనే భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇదే కారణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చిందని కంపెనీ సీఎఫ్‌వో సూసన్ లీ(Susan Li) వెల్లడించారు. ప్రస్తుతం AI వేగంగా మారుతున్న నేపథ్యంలో కంపెనీకి సరైన ఉద్యోగుల సంఖ్య ఎంత ఉండాలన్నదే అర్థం కావడం లేదన్నారు. మరోవైపు AI ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. కానీ AI ఉపయోగాన్ని ఉద్యోగుల పనితీరు అంచనాల్లో కీలకంగా తీసుకుంటుండటంతో మెటా ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. కంపెనీలో అంతర్గత అసంతృప్తి కూడా రికార్డు స్థాయికి చేరిందని సమాచారం.