Page Loader
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. 69 బిలియన్ డాలర్ల ఒప్పందంపై ప్రభావం!
మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. 69 బిలియన్ డాలర్ల ఒప్పందంపై ప్రభావం!

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. 69 బిలియన్ డాలర్ల ఒప్పందంపై ప్రభావం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 25, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్‌ రంగంలోని దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ రానున్న వారంలో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా ఎక్స్‌బాక్స్‌ విభాగంలోని ఉద్యోగులను లక్ష్యంగా పెట్టుకుని ఈ లేఆఫ్‌ ప్రక్రియ కొనసాగనుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సంస్థను పునర్‌ వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతోంది. గత 18 నెలల్లో మైక్రోసాఫ్ట్‌ ప్రకటిస్తున్న నాలుగో అతిపెద్ద లేఆఫ్‌ ఇదే కావచ్చు. ముఖ్యంగా 69 బిలియన్‌ డాలర్లు వెచ్చించి యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేసిన తర్వాత లాభదాయకతపై దృష్టిసారించాలని సంస్థపై ఒత్తిళ్లు పెరిగాయి.

Details

మే నెలలో 6వేల మంది తొలగింపు

దీంతో రాబోయే లేఆఫ్‌లో ఎక్స్‌బాక్స్‌ గ్రూప్‌లోని అనేక బృందాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. కొంతకాలంగా మైక్రోసాఫ్ట్‌ చేపట్టిన లేఆఫ్‌ల కారణంగా సంస్థ గ్లోబల్‌ ఆపరేషన్లలో అనేక మంది ఉద్యోగాలపై ప్రభావం పడింది. జూన్‌ 30న మైక్రోసాఫ్ట్‌ ఆర్థిక సంవత్సరం ముగిసే సందర్భంలో రానున్న వారంలోనే సంస్థ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా గేమింగ్‌తోపాటు మిగతా విభాగాలకూ లేఆఫ్‌ల ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నట్టు కథనంలో పేర్కొంది. మే నెలలో 6,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్‌ తొలగించింది. ఇందులో ముఖ్యంగా ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ టీమ్‌లకే ఎక్కువ ప్రభావం పడింది.

Details

మార్కెటింగ్, సేల్స్ విభాగంలో 45వేల మంది

ఎక్స్‌బాక్స్‌ డివిజన్‌ మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ కన్సోళ్లు, గేమ్‌ డెవలప్‌మెంట్‌ స్టూడియోలు, గేమ్‌పాస్‌ వంటి డిజిటల్‌ సర్వీసులను నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ విభాగంలో అనేక మంది ఉద్యోగులను తొలగించడం, పలు సబ్సిడియరీలను మూసివేయడం జరిగింది. యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ కొనుగోలు తర్వాత వ్యయ నియంత్రణ వ్యూహాన్ని మైక్రోసాఫ్ట్‌ పునఃసమీక్షిస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ, క్లౌడ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై సంస్థ అధికంగా దృష్టిసారించడం కూడా లేఆఫ్‌లకు కారణంగా నిలుస్తోంది. చిన్న, మధ్యశ్రేణి సంస్థలకు సాఫ్ట్‌వేర్‌ విక్రయాలను ఇటీవలే ఔట్‌సోర్స్‌ చేసి, ఇన్‌హౌస్‌ ఉద్యోగులను తప్పించడం కూడా మైక్రోసాఫ్ట్‌ వ్యయ నియంత్రణ ప్రయత్నాలకు నిదర్శనం. జూన్‌ 2024 నాటికి మైక్రోసాఫ్ట్‌ ప్రపంచవ్యాప్తంగా 2.28లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో 45వేల మంది మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగంలో పని చేస్తున్నారు.