Loading...
Microsoft: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్.. ఏఐ మౌలిక వసతులకు భారీ బూస్ట్
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్.. ఏఐ మౌలిక వసతులకు భారీ బూస్ట్

Microsoft: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్.. ఏఐ మౌలిక వసతులకు భారీ బూస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మౌలిక సదుపాయాలను మరింత విస్తరించింది. దేశంలో వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్ల అవసరాలు, ఏఐ ఆధారిత సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో తన నాలుగో క్లౌడ్ రీజియన్‌ను సోమవారం ప్రారంభించింది. 'ఇండియా సౌత్ సెంట్రల్' పేరుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా భారత్‌లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల సామర్థ్యం మరింత పెరగనుంది.

వివరాలు 

నాలుగు నగరాల్లో క్లౌడ్ రీజియన్లు

మైక్రోసాఫ్ట్‌కు ఇప్పటికే భారత్‌లో పుణె, చెన్నై, ముంబయి నగరాల్లో క్లౌడ్ రీజియన్లు ఉన్నాయి.

తాజాగా హైదరాబాద్‌లో నాలుగో కేంద్రాన్ని ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా కంపెనీ క్లౌడ్ మౌలిక సదుపాయాలు మరింత విస్తరించాయి.

దీంతో క్లౌడ్ సామర్థ్యం, ఏఐ మౌలిక సదుపాయాల పరంగా మైక్రోసాఫ్ట్‌కు భారత్‌లో కీలక స్థానం ఏర్పడింది.

కంపెనీ గతంలో ప్రకటించిన 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలో హైదరాబాద్ క్లౌడ్ రీజియన్ విస్తరణ కూడా భాగమే.

క్లౌడ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కోసం ఈ పెట్టుబడులను వినియోగించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది.

వివరాలు 

భారత్‌ కీలక దశలో ఉంది

ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ మాట్లాడుతూ.. భారత్ ప్రస్తుతం డిజిటల్ పరివర్తనలో కీలక దశలో ఉందని చెప్పారు.

ప్రపంచంలో అత్యధికంగా డేటాను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా మారిందని పేర్కొన్నారు.

''ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న డేటాలో దాదాపు 20 శాతం భారత్ నుంచే వస్తోంది. అయితే ప్రపంచ డేటా సెంటర్ సామర్థ్యంలో మన దేశ వాటా కేవలం 3 శాతం మాత్రమే. ఈ రెండు సంఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసమే ఈ దశాబ్దంలో భారత్‌కు ఎదురయ్యే అతిపెద్ద అవకాశం'' అని చందోక్ వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

2035 నాటికి భారీగా పెరగనున్న సామర్థ్యం

ప్రస్తుతం భారత్‌లో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం సుమారు 2 గిగావాట్లుగా ఉందని చందోక్ తెలిపారు.

2035 నాటికి ఇది 12 నుంచి 14 గిగావాట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.

వ్యాపార సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, ఇతర సంస్థలు ఏఐ ప్రయోగాల దశను దాటి.. ఏఐ అప్లికేషన్లను పెద్ద ఎత్తున వినియోగించడం ప్రారంభిస్తున్న నేపథ్యంలో డేటా సెంటర్ల విస్తరణ అవసరం మరింత పెరుగుతుందని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక వసతులు

భారత్‌లో ఏఐ సేవలకు ఇప్పటికే బలమైన డిమాండ్ ఉందని చందోక్ పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఈ రంగం మరింత విస్తరించేందుకు అవసరమైన భౌతిక మౌలిక సదుపాయాలను నిర్మించడం ప్రస్తుతం ప్రధాన సవాలని తెలిపారు.

''మనం నిర్మిస్తున్న డిజిటల్ స్థాయికి అనుగుణంగా భౌతిక మౌలిక సదుపాయాల స్థాయిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇది మనందరి జాతీయ కర్తవ్యం'' అని చందోక్ వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT