Loading...
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ అవకాశం.. భారత్‌పైనా ప్రభావం
భారత్‌పైనా ప్రభావం

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ అవకాశం.. భారత్‌పైనా ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌, కెనడాలోని ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్‌ ఆఫర్‌ (VEO)ను ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వైదొలగవచ్చు. ఈ నాలుగు దేశాల్లోని లెవెల్‌ 70 లేదా అంతకంటే తక్కువ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ అవకాశం వర్తిస్తుంది. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల సీనియారిటీని సూచించేందుకు వివిధ అంతర్గత గ్రేడ్‌లను ఉపయోగిస్తారు. ఈ ప్రమాణాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60,000 మంది ఉద్యోగులు ఈ ఆఫర్‌కు అర్హులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివరాలు 

2026 డిసెంబరు 1వ తేదీలోగా నిర్ణయాన్నితెలియజేయాలి 

భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు సుమారు 23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే వీరిలో ఎంతమందికి ఈ స్వచ్ఛంద నిష్క్రమణ పథకం వర్తిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మన దేశంలో ఈ ఆఫర్‌ను ఎంచుకోవాలనుకునే అర్హులైన ఉద్యోగులు 2026 డిసెంబరు 1వ తేదీలోగా తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.

ఈ పథకం కింద స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదిలివేసే వారికి సంస్థలో పనిచేసిన ప్రతి ఏడాదికి ఒక నెల ప్రాథమిక వేతనం (బేసిక్‌ శాలరీ) చొప్పున పరిహార ప్యాకేజీ అందిస్తారు.

దీనితో పాటు ఆరోగ్య బీమా, కెరీర్‌ ప్రణాళిక, తదుపరి ఉద్యోగ అవకాశాల కోసం అవసరమైన మార్గదర్శక సేవలను కూడా అందించనున్నారు.

వివరాలు 

2029 నాటికి 20.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి

మరోవైపు ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ అవకాశం కల్పిస్తున్నప్పటికీ, భారత్‌లో పెట్టుబడుల విషయంలో మైక్రోసాఫ్ట్‌ తన ప్రణాళికలకు కట్టుబడి ఉందని సంస్థ స్పష్టం చేసింది.

2029 నాటికి దేశంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించడం కోసం 20.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.95 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది.

మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ అమి కోల్‌మన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

ADVERTISEMENT