LOADING...
India GDP: 2026-27లో భారత్ జీడీపీ 6.4 శాతం వృద్ధి: మూడీస్ అంచనా
2026-27లో భారత్ జీడీపీ 6.4 శాతం వృద్ధి: మూడీస్ అంచనా

India GDP: 2026-27లో భారత్ జీడీపీ 6.4 శాతం వృద్ధి: మూడీస్ అంచనా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత్ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉండనుందని.. జీ-20 దేశాల్లోనే అత్యంత వేగంగా ఎదిగే ఆర్థిక వ్యవస్థగా కూడా నిలవనుందని సోమవారం మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశీయ వినియోగం బలంగా ఉండటం,ప్రభుత్వ విధాన చర్యలు, బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండటమే దీనికి ప్రధాన కారణాలని తెలిపింది. బ్యాంకింగ్ రంగంపై విడుదల చేసిన నివేదికలో ఆస్తుల నాణ్యత బాగానే ఉంటుందని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో(ఎంఎస్‌ఎంఈలు) కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ రుణ నష్టాలను భరించేందుకు బ్యాంకులకు సరిపడా నిల్వలు ఉన్నాయని పేర్కొంది. 2026లో కూడా బ్యాంకులకు అనుకూల వాతావరణం కొనసాగుతుందని, మాక్రో ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, నిర్మాణాత్మక సంస్కరణలు దానికి తోడవుతాయని మూడీస్ చెప్పింది.

వివరాలు 

ఆర్థిక సర్వేలో పేర్కొన్న 6.8 నుంచి 7.2 శాతం అంచనాల కంటే తక్కువ

2025 సెప్టెంబర్‌లో జీఎస్టీ సరళీకరణ,అంతకుముందు వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితుల పెంపు వల్ల వినియోగదారుల ఖర్చు సామర్థ్యం పెరిగి వినియోగ ఆధారిత వృద్ధికి ఊతం లభిస్తుందని వివరించింది. అయితే ఈ అంచనాలు గత నెల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న 6.8 నుంచి 7.2 శాతం అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత్ 7.4 శాతం వృద్ధి సాధించవచ్చని అధికారిక అంచనాలు సూచిస్తున్నాయి.

వివరాలు 

రుణ వృద్ధి 2026-27లో 11 నుంచి 13 శాతానికి పెరిగే అవకాశం 

ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం, వృద్ధి ఊపు కొనసాగుతున్న నేపథ్యంలో అవసరమైతేనే 2026-27లో ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని మరింత సడలించవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. ఇప్పటికే 2025లో ఆర్బీఐ పాలసీ రేటును మొత్తం 125 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకొచ్చింది. రుణ వృద్ధి 2026-27లో 11 నుంచి 13 శాతానికి పెరగవచ్చని, కార్పొరేట్ రుణాల నాణ్యత బలంగా ఉంటుందని, బ్యాంకుల మూలధన స్థితి, లిక్విడిటీ స్థిరంగా కొనసాగుతాయని, అవసరమైన వేళ ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని మూడీస్ స్పష్టం చేసింది.

Advertisement