జూన్ త్రైమాసికంలో 6-6.3 శాతంగా జీడీపీ వృద్ధిని అంచనా వేసిన మూడీస్
భారత ఆరిక్థ వ్యవస్థ జూన్ త్రైమాసికంలో 6 నుంచి 6.3 శాతం వృద్ధిని నమోదు చేసేందుకు అవకాశం ఉందని ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ మూడీస్ వెల్లడించింది. ఈ మేరకు తాము అంచనా వేసినట్లు ఆదివారం పేర్కొంది. అయితే ప్రస్తుత 2022- 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రభుత్వ ఆదాయాలు బలహీనంగా మారుతున్నందున స్థూల దేశీయోత్పత్తి పడిపోయేందుకు ఆస్కారం ఉన్నట్టు వివరించింది. 2022-23 స్థూల దేశీయోత్పత్తికి సంబంధించి 81.8 శాతం మేర ప్రభుత్వ రుణాన్ని సాధారణంగానే కలిగి ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ మేనేజింగ్ డైరెక్టర్ జెనె ఫాంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు రుణ స్థోమత తక్కువగానే కలిగి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఉన్నా భారత్ కు ఢోకా లేదు : మూడీస్
గతవారం ఆర్బీఐ వేసిన 8 శాతం అంచనా కంటే మూడీస్ అంచనా ఇంకా తక్కువగానే ఉండటం కొసమెరుపు. ఈ నేపథ్యంలోనే మూడీస్ 6 - 6.3 శాతం వృద్ధిని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికంలో నమోదైన 6.1 శాతం వృద్ధితో పోల్చుకుంటే ఈసారి స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ గణాంకాలు నియంత్రణలోనే ఉన్నా డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మూడీస్ అంటోంది. అయితే, అధిక వడ్డీ రేట్ల ప్రభావం కారణంగా వృద్ధి అంచనా స్వల్పంగానే పెంచామని మూడీస్ ఎండీ జీన్ ఫాంగ్ అన్నారు. ఓవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే కనిపిస్తున్నా మరోవైపు భారత్ వృద్ధి మెరుగ్గానే కొనసాగుతుందని స్పష్టం చేశారు.