TCS: టీసీఎస్ క్యాంపస్‌లో లైంగిక వేధింపులు,బలవంతపు మత మార్పిడి ఆరోపణలు.. ఏడుగురు ఉద్యోగులు అరెస్ట్.. ఛైర్మన్ కీలక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కేంద్రంలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో సీనియర్ మానవ వనరుల విభాగాధికారి సహా మొత్తం ఏడుగురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సంస్థ స్పందిస్తూ, అరెస్టయిన వారిని తాత్కాలికంగా విధుల నుండి తప్పించినట్లు వెల్లడించింది. కార్యాలయాల్లో ఇలాంటి ప్రవర్తనను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. విచారణలో పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని తెలిపింది.
వివరాలు
సహోద్యోగిపై ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగి
పోలీసుల వివరాల ప్రకారం, నాసిక్ కేంద్రంలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై ఫిర్యాదు చేసింది.
వివాహం పేరుతో మోసం చేసినట్లు ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదును విచారించిన పోలీసులకు మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి.
మరో ఏడుగురు మహిళలు ముందుకు వచ్చి తమపై జరిగిన వేధింపుల గురించి వివరించారు.
తమపై మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారని వారు పేర్కొన్నారు.
ఈ కేసులో నిదా ఖాన్, అసిఫ్ అన్సారీ, షారుఖ్ ఖురేషీ, రజా మేమన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, షఫీ షేక్ పేర్లు వెలుగులోకి వచ్చాయి.
వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
వివరాలు
2022 నుంచి 2026 మధ్యకాలంలో వేధింపులు
2022 నుంచి 2026 మధ్యకాలంలో కార్యాలయ పరిసరాల్లోనే ఈ వేధింపులు జరిగినట్లు బాధితులు తెలిపారు.
అనుచితంగా తాకడం, శరీరాన్ని అవమానించే వ్యాఖ్యలు చేయడం, అసభ్యంగా మాట్లాడడం, మాంసాహారం తినాలని బలవంతపెట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయాన్ని మానవ వనరుల విభాగానికి తెలియజేసినా తగిన చర్యలు తీసుకోలేదని బాధితులు పేర్కొన్నారు.
దీంతో పోలీసులు రహస్యంగా దర్యాప్తు ప్రారంభించారు. ఏడుగురు మహిళా పోలీసులను మారువేషంలో కేంద్రంలోకి పంపి అనుచితంగా ప్రవర్తిస్తున్న ఉద్యోగులను పట్టుకున్నారు.
అదనంగా సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించి మిగతా ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు.
వివరాలు
సీనియర్ అధికారి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ
ఈ ఘటనపై టాటా సన్స్ సంస్థ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్పందిస్తూ, ఈ వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగించేదిగా పేర్కొన్నారు.
ఘటనను అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్నామని తెలిపారు. సంబంధిత ఉద్యోగులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ఒక సీనియర్ అధికారి ఆధ్వర్యంలో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రధాన కార్యనిర్వాహణ అధికారి ఆరతి సుబ్రమణియన్ పర్యవేక్షణలో పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.
మరోవైపు, నాసిక్ కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై ఐటీ ఉద్యోగుల సంఘం (NITEs) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన మార్గదర్శకాలు రూపొందించాలని విజ్ఞప్తి చేసింది.