Loading...
Venugopal Dhoot: వీడియోకాన్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా.. ఎన్‌సీఎల్‌టీ కీలక ఉత్తర్వులు
వీడియోకాన్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా.. ఎన్‌సీఎల్‌టీ కీలక ఉత్తర్వులు

Venugopal Dhoot: వీడియోకాన్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా.. ఎన్‌సీఎల్‌టీ కీలక ఉత్తర్వులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ మాజీ ప్రమోటర్‌, డైరెక్టర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) ముంబయి బెంచ్‌ ప్రకటించింది. వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియ, రుణాల చెల్లింపు ప్రణాళిక విఫలమవడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నిర్ణయం తీసుకుంది. దివాలా, దివాలా పరిష్కార స్మృతి (IBC) నిబంధనల ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

36 నెలల్లో రూ.600 కోట్లు చెల్లిస్తా: ధూత్

వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌, వీడియోకాన్‌ టెలికమ్యూనికేషన్స్‌ సహా గ్రూప్‌ సంస్థలు తీసుకున్న రుణాలకు వేణుగోపాల్‌ ధూత్‌ వ్యక్తిగత హామీలు ఇచ్చారు.

ఈ రుణాల చెల్లింపుల్లో విఫలమైన నేపథ్యంలో బ్యాంకులు 2018 ఫిబ్రవరిలోనే ఆయనపై క్లెయిమ్‌లు దాఖలు చేశాయి.

వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా సిలిగురిలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు ద్వారా 36 నెలల్లో రూ.600 కోట్లు చెల్లిస్తానని ధూత్‌ ప్రతిపాదించారు.

అయితే ఈ ప్రణాళికలో ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకపోవడంతో పాటు, భవిష్యత్తులో చెల్లింపులు చేస్తారనే నమ్మకం రుణదాతలకు కలగలేదు.

దీంతో వారు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.

వివరాలు 

90 రోజుల్లో ప్రాథమిక నివేదిక సమర్పించాలని ఆదేశం 

ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో కొనసాగుతున్న వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియను జులైలో ముగించారు.

అనంతరం పూర్తిస్థాయి దివాలా చర్యలు చేపట్టేందుకు ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. తాజాగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

దివాలా ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆశిష్‌ నారాయణను ట్రస్టీగా నియమించింది. రుణదాతల నుంచి క్లెయిమ్‌లను స్వీకరించాలని ఆయనకు సూచించింది.

90 రోజుల్లో ప్రాథమిక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు తన ఆర్థిక వివరాలను సమర్పించేందుకు వేణుగోపాల్‌ ధూత్‌కు ఏడు రోజుల గడువు ఇచ్చింది.

ఈ దివాలా ప్రక్రియలో భాగంగా ఎస్‌బీఐ మొత్తం రూ.12,668 కోట్ల రుణ బకాయిలను క్లెయిమ్‌ చేస్తోంది.

ADVERTISEMENT