Europe Bomb threats: ఐరోపా అంతటా విమానాలకు బాంబు బెదిరింపులు.. పలు విమానాలు దారి మళ్లింపు
ఈ వార్తాకథనం ఏంటి
హెల్సింకి నుంచి రోమ్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఇటలీ వైమానిక దళం ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. విమానాన్ని రోమ్‌లోని ఫియుమిసినో విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. మరోవైపు డబ్లిన్ నుంచి రోమ్‌కు వస్తున్న విమానాన్ని ఫ్రాన్స్‌కు మళ్లించారు. ఐరోపా అంతటా పలు విమానాలకు బెదిరింపులు రావడంతో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. హెల్సింకి (ఫిన్లాండ్) నుంచి ఇటలీ రాజధాని రోమ్‌కు గురువారం ఉదయం బయలుదేరిన ఫిన్‌ఎయిర్ విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఇటలీ వైమానిక దళం ఫైటర్ జెట్లను పంపించింది. వాటి రక్షణలో విమానాన్ని రోమ్‌లోని ఫియుమిసినో విమానాశ్రయానికి తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.
వివరాలు
ఫ్రాన్స్‌కు మళ్లించిన మరో విమానం..
అనంతరం బాంబు నిర్వీర్య బృందం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నుంచి రోమ్‌కు బయలుదేరిన ఏయిర్ లింగస్ విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.
దీంతో ఆ విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఎవరెక్స్ సైనిక వైమానిక స్థావరానికి మళ్లించి అత్యవసరంగా దించారు.
ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫైటర్ జెట్ విమానానికి రక్షణగా వెళ్లింది.
మరోవైపు మిలాన్ నుంచి పోలాండ్ రాజధాని వార్సాకు వెళ్తున్న విజ్ ఎయిర్ విమానాన్ని వియన్నాకు మళ్లించారు.
బల్గేరియా, బెల్జియం దేశాల్లోని మరికొన్ని విమానాలకు కూడా ఇదే తరహా హెచ్చరికలు వచ్చాయి.
వివరాలు
బెదిరింపులన్నీ నకిలీవి
గత కొన్ని రోజులుగా ఐరోపా అంతటా ప్రయాణికుల విమానాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి.
అయితే, ఈ బెదిరింపులన్నీ నకిలీవని, విమానాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు.
అయినప్పటికీ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అంతర్జాతీయ భద్రతా నిబంధనల ప్రకారం ఫైటర్ జెట్లను రంగంలోకి దించి, విమానాలను తనిఖీ చేశారు.