Loading...
Money mule accounts: మనీ మ్యూల్‌ ఖాతాలకు కొత్త నిబంధనలు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం
మనీ మ్యూల్‌ ఖాతాలకు కొత్త నిబంధనలు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

Money mule accounts: మనీ మ్యూల్‌ ఖాతాలకు కొత్త నిబంధనలు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సైబర్‌ ఆధారిత ఆర్థిక నేరాలు, అక్రమ లావాదేవీలకు ఉపయోగించే మనీ మ్యూల్‌ ఖాతాలను నియంత్రించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ బీ ఐ) కొత్త నిబంధనలను సిద్ధం చేసింది. సైబర్‌ నేరాల ద్వారా వచ్చిన డబ్బును బదిలీ చేసేందుకు ఉపయోగించే అనుమానాస్పద ఖాతాలపై బ్యాంకులు విధించే తాత్కాలిక డెబిట్‌ హోల్డ్‌కు గరిష్ఠంగా 60 రోజుల గడువును ప్రతిపాదించింది. ఈ ముసాయిదా నిబంధనలపై బ్యాంకులు, ప్రజల నుంచి అక్టోబరు 2 వరకు సూచనలు, అభిప్రాయాలను ఆర్‌బీఐ ఆహ్వానించింది. వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం తుది మార్గదర్శకాలను 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. అయితే బ్యాంకులు కోరుకుంటే వీటిని అంతకంటే ముందే అమలు చేసుకోవచ్చు.

వివరాలు

రూ.1,000 దాటితే..

కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) సాంకేతికతల సాయంతో బ్యాంకులు అనుమానాస్పద నగదు బదిలీలను గుర్తిస్తాయి.

రూ.1,000లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో ఉన్న సందేహాస్పద బదిలీని గుర్తించిన వెంటనే బ్యాంకులు తాత్కాలికంగా డెబిట్‌ హోల్డ్‌ విధించవచ్చు.

ఖాతాదారు సాధారణంగా చేసే లావాదేవీలకు భిన్నంగా ఉండటం, ఖాతాలో పెద్ద మొత్తంలో నిధులు జమ కావడం, ఇప్పటికే సైబర్‌ నేరాల జాబితాలో ఉన్న ఖాతాలతో సంబంధం ఉండటం వంటి అంశాల ఆధారంగా అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తారు.

అనుమానాస్పదంగా ఉన్న మొత్తానికే హోల్డ్‌ను పరిమితం చేయడం సాధ్యమైతే మొత్తం ఖాతాను నిలిపివేయాల్సిన అవసరం ఉండదు.

ఖాతా స్థాయిలో హోల్డ్‌ విధించడం చివరి ప్రత్యామ్నాయంగా, అదీ అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉండాలని ముసాయిదా నిబంధనల్లో ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

వివరాలు

20 రోజుల గడువు

డెబిట్‌ హోల్డ్‌ విధించిన వెంటనే బ్యాంకు ఖాతాదారుడికి అందుకు గల కారణాలు, హోల్డ్‌ను తొలగించుకునే విధానం, సంప్రదించాల్సిన అధికారి వివరాలను తెలియజేయాలి.

లావాదేవీ లేదా ఖాతా నిజమైనదేనని వివరించేందుకు ఖాతాదారుడికి 20 రోజుల సమయం ఇవ్వాలి. ఖాతాదారు ఇచ్చిన వివరణ అందిన తర్వాత బ్యాంకు దాన్ని పరిశీలించి 10 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి.

ఒకవేళ ఖాతాదారు ఎలాంటి వివరణ ఇవ్వకపోతే.. హోల్డ్‌ విధించిన తేదీ నుంచి 30 రోజుల్లోగా బ్యాంకు నిర్ణయం తీసుకోవాలి.

ఖాతాదారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందని బ్యాంకు భావిస్తే హోల్డ్‌ను వెంటనే తొలగించాలి.

అయితే వివరణలో అనుమానాలు కొనసాగితే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ వ్యవస్థ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ADVERTISEMENT

వివరాలు

గరిష్ఠంగా 60 రోజులే

విచారణ అధికారి నుంచి హోల్డ్‌ను కొనసాగించాలని ఆదేశాలు వస్తే.. బ్యాంకులు వాటిని వెంటనే అమలు చేయాలి.

కేసును పోలీసులకు పంపిన తేదీ నుంచి 30 రోజుల్లోగా హోల్డ్‌ను కొనసాగించాలనే ఆదేశాలు రాకపోతే 31వ రోజున హోల్డ్‌ను తొలగించాలి.

పోలీసులు లేదా విచారణ అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేని పరిస్థితుల్లో తాత్కాలిక డెబిట్‌ హోల్డ్‌ గరిష్ఠంగా 60 రోజులు మాత్రమే కొనసాగాలి.

ఈ 60 రోజుల్లో తొలి దశలో బ్యాంకు నిర్వహించే పరిశీలన, ఖాతాదారుడికి వివరణ ఇచ్చేందుకు ఇచ్చే సమయం కలిపి 30 రోజులు ఉంటాయి.

ఆ తర్వాత దర్యాప్తు సంస్థ నుంచి వచ్చే ఆదేశాల కోసం మరో 30 రోజుల సమయం ఉంటుంది.

ADVERTISEMENT