Stock Market: స్టాక్ మార్కెట్‌లో కొత్తవారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. గతంలో కొద్దిమందికే పరిమితమైన షేర్ మార్కెట్ ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా ఆదాయ వనరుగా మారుతోంది. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు పెట్టుబడులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. గత కొన్నేళ్లలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య భారీగా పెరగడం ఈ మార్పుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు 9 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాలు, 2026 నాటికి 22 కోట్లకు పైగా చేరనున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.
వివరాలు
సులభంగా డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు అందుబాటులో ఉన్న విధానాలు
మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు కీలకంగా పనిచేస్తాయి. సెన్సెక్స్ దేశంలోని ప్రముఖ 30 పెద్ద సంస్థల పనితీరును సూచిస్తే, నిఫ్టీ 50 వివిధ రంగాలకు చెందిన 50 అగ్రశ్రేణి సంస్థల స్థితిని ప్రతిబింబిస్తుంది. బ్యాంకింగ్, సమాచార సాంకేతికం, సిమెంట్, రసాయనాలు వంటి అనేక రంగాల సంస్థలు ఇందులో భాగంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతా తప్పనిసరి. డీమ్యాట్ ఖాతా అనేది షేర్లను డిజిటల్ రూపంలో భద్రపరిచే విధానం. ట్రేడింగ్ ఖాతా ద్వారా షేర్ల కొనుగోలు, అమ్మకాలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఈ ఖాతాలను ఇంటి నుంచే సులభంగా ప్రారంభించుకునే అవకాశం ఉంది.
వివరాలు
పత్రాల పరిశీలన పూర్తైన తర్వాత ఖాతా ప్రారంభమవుతుంది
ముందుగా మార్కెట్ నియంత్రణ సంస్థ అనుమతి పొందిన విశ్వసనీయ సంస్థను ఎంపిక చేసుకోవాలి. వారి సేవలు,వసూలు చేసే రుసుములు,వినియోగదారుల అభిప్రాయాలను పరిశీలించడం మంచిది. అనంతరం పాన్ కార్డు,ఆధార్ కార్డు,బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ సంఖ్య వంటి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారాన్ని నింపి, 'మీ కస్టమర్‌ను తెలుసుకోండి' (KYC) ప్రక్రియను పూర్తి చేయాలి.దీనికోసం OTP లేదా వీడియో వెరిఫికేషన్ పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైన పత్రాలను జత చేసి, డిజిటల్ సంతకం ద్వారా దరఖాస్తును సమర్పించాలి. పత్రాల పరిశీలన పూర్తైన తర్వాత ఖాతా ప్రారంభమవుతుంది. అనంతరం వినియోగదారునికి ప్రవేశ వివరాలు అందుతాయి. వాటితో ఖాతాలోకి ప్రవేశించి బ్యాంకు నుంచి నిధులు జమ చేసి పెట్టుబడులు ప్రారంభించవచ్చు.
వివరాలు
మార్కెట్‌పై సరైన అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం
కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు మార్కెట్‌పై సరైన అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్ విలువ,సంస్థల ఆర్థిక స్థితి,లాభ నష్టాల అంచనాలు వంటి అంశాలను తెలుసుకోవాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. త్వరగా లాభాలు వస్తాయనే ఆశతో నిర్ణయాలు తీసుకోవద్దు. మంచి సంస్థల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలం కొనసాగితే మంచి ఫలితాలు పొందేఅవకాశం ఉంటుంది. ప్రతి నెలా క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం తగ్గుతుంది. ఇది భవిష్యత్తులో మంచి సంపదను సృష్టించడంలో సహాయపడుతుంది.ఒకే రంగంలో పెట్టుబడులు పెట్టకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్ట ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మార్కెట్ పడిపోయిందని భయంతో అమ్మడం,ఒక్కసారిగా పెరిగిందని ఆశతో కొనుగోలు చేయడం వంటి భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండాలి.
వివరాలు
అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం అత్యంత ప్రమాదకరం
అప్పు తీసుకుని మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. మార్కెట్‌లో నష్టాలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే సామాజిక మాధ్యమాలు, సందేశ సమూహాల్లో వచ్చే పుకార్లను గుడ్డిగా నమ్మకూడదు. పెట్టుబడి పెట్టే ముందు స్వయంగా సమాచారం సేకరించి నిర్ణయం తీసుకోవాలి. స్టాక్ మార్కెట్ అనేది అదృష్టంపై ఆధారపడే వ్యవస్థ కాదు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, సహనం ఉంటే దీర్ఘకాలంలో మంచి ఆర్థిక భద్రతను సాధించవచ్చు. అవగాహనతో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో స్థిరమైన సంపదను నిర్మించుకోవడం సాధ్యమవుతుంది.