
H1B fee: కొత్త H-1B నిబంధనలపై ఇమిగ్రేషన్ శాఖ స్పష్టత.. తగ్గిన ఆందోళన : నాస్‌కామ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాల ఫీజులను పెంచే ప్రకటనతో ఏర్పడిన గందరగోళానికి అమెరికా ఇమిగ్రేషన్ శాఖ ఇచ్చిన వివరణ కొంత ఉపశమనం ఇచ్చిందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్‌కామ్) ప్రకటించింది. ఈ అంశంపై సోమవారం నాస్‌కామ్ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ద్వారా ఈ విషయానికి సంబంధించిన ఎఫ్‌ఏక్యూ కూడా విడుదలయినట్లు గుర్తు చేశారు. నాస్‌కామ్ ప్రకారం,ఈ వివరణ వల్ల ప్రస్తుత హెచ్1బీ వీసా ఉన్న వ్యక్తులపై ట్రంప్ ప్రకటించిన ఫీజు పెంపు ప్రభావం ఉండదని స్పష్టమయింది. అలాగే,భవిష్యత్తులో కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులపై ఇది వన్‌టైమ్ ఫీజుగా మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
వివరాలు
హెచ్1బీ వీసా ఫీజుల పెంపు భారత్ కంపెనీలపై తాత్కాలి ప్రభావం
2026 నుండి ఈ ఫీజులు అమలు కాబోతోందని పేర్కొని, ఈ సమయం ద్వారా కంపెనీలు స్థానికులను శిక్షణతో సిద్ధం చేసుకోవడానికి అవకాశాన్ని పొందుతాయని నాస్‌కామ్ అభిప్రాయపడింది. పరిశ్రమ ప్రస్తుతానికి ఈ శిక్షణకు దాదాపు బిలియన్ డాలర్ల ఖర్చు చేస్తోందని కూడా పేర్కొంది. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్‌కు చెందిన కంపెనీలు, గత కొన్ని సంవత్సరాలుగా హెచ్1బీ వీసాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తూ, స్థానికులను ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాయని నాస్‌కామ్ వెల్లడించింది. గణాంకాల ప్రకారం, 2015లో టాప్ 10 భారత్ కంపెనీలు 14,792 హెచ్1బీ వీసాలను పొందగా, 2024లో అది 10,162కు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో, హెచ్1బీ వీసా ఫీజుల పెంపు భారత్ కంపెనీలపై తాత్కాలికంగా మాత్రమే ప్రభావం చూపుతుందని నాస్‌కామ్ పేర్కొంది.