No UPI Day: అక్టోబర్ 2న 'నో యూపీఐ డే'.. MDRకు వ్యతిరేకంగా మొబైల్ రిటెయిలర్ల నిరసన
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను విధించడాన్ని మొబైల్ రిటెయిలర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ రుసుముల కారణంగా తమ ఆదాయానికి గండిపడుతోందని వారు పేర్కొంటున్నారు. దీనికి నిరసనగా అక్టోబర్ 2న.. గాంధీ జయంతి రోజున 'నో యూపీఐ డే' (No UPI Day) నిర్వహించనున్నట్లు ఆలిండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్ (AIMRA) వెల్లడించింది.
వివరాలు
రూ.2 వేలకుపైగా లావాదేవీలపై 0.4 శాతం MDR
వ్యక్తులు వ్యాపారులకు రూ.2 వేలకుపైగా చేసే యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే వ్యక్తిగతంగా చేసే లావాదేవీలకు, చిరు వ్యాపారులకు ఈ రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.
అయినప్పటికీ ఈ ఛార్జీల కారణంగా రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారుల ఆదాయంపై ప్రభావం పడుతోందని AIMRA వైస్ ప్రెసిడెంట్ తర్వీంద్ సింగ్ తెలిపారు.
వివరాలు
చిన్న వ్యాపారులపై రూ.2 వేల నుంచి రూ.12 వేల వరకు ప్రభావం
కొత్త రుసుముల కారణంగా యూపీఐ ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు స్వీకరించే చిన్న వ్యాపారులకు సగటున రూ.2 వేల నుంచి రూ.12 వేల వరకు ఆదాయానికి గండిపడుతోందని తర్వీంద్ సింగ్ పేర్కొన్నారు.
మొత్తంగా రిటెయిలర్లపై నెలకు రూ.40 కోట్ల భారం పడుతుందని.. ఏడాదికి ఈ మొత్తం రూ.500 కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు.
వివరాలు
అక్టోబర్ 2న 'నో యూపీఐ డే'
MDR విధింపును నిరసిస్తూ గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న 'నో యూపీఐ డే' నిర్వహించనున్నట్లు తర్వీంద్ సింగ్ తెలిపారు.
ఆ రోజు దుకాణాల్లోని క్యూఆర్ కోడ్‌లపై నల్లటి వస్త్రం కప్పి ఉంచుతామని, యూపీఐ లావాదేవీలను అనుమతించబోమని స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకెళ్లాలంటే జీరో ఎండీఆర్ ఉండాలని AIMRA డిమాండ్ చేసింది.
డిజిటల్ పేమెంట్స్ మరింత వృద్ధి చెందాలంటే రిటెయిల్ ఎకోసిస్టమ్‌పై ఎలాంటి ఛార్జీల భారం ఉండకూడదని తర్వీంద్ సింగ్ అన్నారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని వ్యాపార, వర్తక సంఘాలు కూడా అక్టోబర్ 2న 'నో యూపీఐ డే' నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు.