Promotions: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,630 మందికి ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతిలో సచివాలయ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ ఆమోదం పొందిన అనంతరం పదోన్నతి ఛానెల్స్‌కు సంబంధించిన అధికారిక జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిర్ణయంతో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలు (గ్రేడ్-II), వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి.
వివరాలు
815 కొత్త జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
వార్డుల్లో ఖాళీగా ఉన్న, మిగిలిపోయిన పోస్టులను క్రమబద్ధీకరించడం ద్వారా కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ కొత్త పోస్టుల్లో అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించనున్నారు.
ఈ పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు.
వివరాలు
మరో రెండు కేటగిరీల్లో గ్రేడ్-Iకి అప్‌గ్రేడ్
అదేవిధంగా వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ క్యాడర్లలోని 815 పోస్టులను గ్రేడ్-II నుంచి గ్రేడ్-Iకి అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
దీంతో ఈ రెండు కేటగిరీల్లో కలిపి మొత్తం 1,630 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి.
వివరాలు
ఉద్యోగుల సేవలకు గుర్తింపు
పురపాలక ఉద్యోగుల అనుభవం, వారు అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సేవలు మరింత బలోపేతం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
అధికారుల కమిటీ నుంచి సిఫార్సులు అందిన వెంటనే మిగిలిన మరో రెండు కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన నిబంధనలను కూడా త్వరలోనే జారీ చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.