Loading...
FIFA cyber-attack: సైబర్ దాడికి గురైన ఫిఫా.. వ్యక్తిగత, వ్యాపార సమాచారం లీక్
సైబర్ దాడికి గురైన ఫిఫా.. వ్యక్తిగత, వ్యాపార సమాచారం లీక్

FIFA cyber-attack: సైబర్ దాడికి గురైన ఫిఫా.. వ్యక్తిగత, వ్యాపార సమాచారం లీక్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఫుట్‌ బాల్‌ను నియంత్రించే అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) సైబర్ దాడికి గురైంది. ఈ దాడిలో కొంతమేర వ్యక్తిగత, వ్యాపార సమాచారానికి సంబంధించిన వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కినట్లు ఫిఫా వెల్లడించింది. అక్రమంగా సమాచారాన్ని సేకరించడం, వాటిని బహిరంగంగా ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడం ఆందోళనకరమని పేర్కొంది. ఈ ఘటన వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా, బాధితులకు తీవ్ర పరిణామాలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ప్రకటనలో ఫిఫా తెలిపింది.

వివరాలు 

సైబర్ దాడి వెనుక హ్యాకర్ల గ్రూప్

హ్యాండ్సమ్ బాయ్ హ్యాకింగ్ క్లబ్ అనే హ్యాకర్ల బృందం ఈ సైబర్ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది.

గత వారం ఫిఫాకు చెందిన ఫైళ్లుగా చెబుతూ కొన్ని స్క్రీన్‌షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే, ఆ గ్రూప్‌కు చెందిన ఎక్స్ (గతంలో ట్విటర్) ఖాతాను నిలిపివేయడంతో ఆ పోస్టు కూడా తొలగిపోయింది.

ఫిఫా వద్ద ఉన్న మొత్తం సమాచారంలో ఈ హ్యాకింగ్ ద్వారా బయటపడింది 0.1 శాతం కంటే తక్కువేనని ఈఎస్‌పీఎన్ వెల్లడించింది.

ఫిఫా భద్రతా వ్యవస్థలో లోపం వల్ల ఈ ఘటన జరగలేదని, హ్యాకర్లు సిబ్బందిగా నటించి సమాచారాన్ని సంపాదించినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.

వివరాలు 

దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఫిఫా

సైబర్ దాడి నేపథ్యంలో సంబంధిత అధికారులతో పాటు పోలీసు, దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ఫిఫా తెలిపింది.

అయితే ఈ దాడి ఎప్పుడు జరిగింది? ఏయే వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కాయి? అనే విషయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

మరోవైపు, ప్రపంచకప్‌లోని కొన్ని భాగాలను ప్రైవేటు పెట్టుబడిదారులకు విక్రయించాలన్న ప్రతిపాదనతో ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ సమయంలో సైబర్ దాడి ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఇన్‌ఫాంటినో ప్రపంచకప్ ప్రతిపాదనపై విమర్శలు

ప్రపంచకప్‌లో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పించాలన్న తన ప్రతిపాదనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇన్‌ఫాంటినో స్పందించారు.

ఈ ప్రాజెక్టు కారణంగా విభేదాలు పెరిగాయని, అవి ఇకపై లక్ష్యానికి ఉపయోగపడేలా లేవని అంగీకరించారు.

ఈ ప్రతిపాదన ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో ఫిఫా నిర్వహించే టోర్నీలను బహిష్కరిస్తామని యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (యూఈఎఫ్‌ఏ) హెచ్చరించింది.

వచ్చే ఏడాది జరగనున్న ఫిఫా అధ్యక్ష ఎన్నికల్లో ఇన్‌ఫాంటినోకు పోటీగా అభ్యర్థులను నిలబెట్టేందుకు యూఈఎఫ్‌ఏతో పాటు ఇతర ఖండాల ఫుట్‌బాల్ సమాఖ్యలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఈ ఎన్నికల్లో ఇన్‌ఫాంటినో వరుసగా నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతారని ఇప్పటివరకు అంచనాలు ఉన్నాయి.

ADVERTISEMENT