AI: ఏఐ దెబ్బకు వచ్చే ఐదేళ్లలో 2.4 కోట్ల ఉద్యోగాలు ఖతం? జేపీ మోర్గాన్ సంచలన నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా రానున్న ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.4 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వెల్త్ మేనేజ్మెంట్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా శారీరక శ్రమతో సంబంధం లేని నాలెడ్జి వర్కర్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుందని పేర్కొంది.
వివరాలు
కంపెనీల్లో పెరగనున్న ఏఐ వినియోగం
రాబోయే ఐదేళ్లలో ప్రపంచ ఉద్యోగ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని నివేదిక అంచనా వేసింది.
వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని మరింత పెంచే కొద్దీ,ప్రస్తుతం ఆయా పనులు నిర్వహిస్తున్న ఉద్యోగుల అవసరం తగ్గే అవకాశం ఉందని వివరించింది.
ఈ పరిణామం వల్ల వరుసగా ఐదేళ్లపాటు ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జి వర్కర్లలో ఏటా 1.3 శాతం మంది ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని తెలిపింది.
కంపెనీలు ఏఐ కోసం కేటాయించే మొత్తం బడ్జెట్లో సగం నిధులను నాలెడ్జి వర్కర్ల స్థానాల్లో ఏఐ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టేందుకు ఖర్చు చేస్తాయనే అంచనాతో ఈ గణాంకాలను రూపొందించినట్లు నివేదిక వెల్లడించింది.
వివరాలు
ఉద్యోగాలన్నీ కనుమరుగవుతాయనుకోవద్దు
2000 సంవత్సరం ప్రారంభంలో తయారీ రంగంలో చోటుచేసుకున్న ఉద్యోగ నష్టాలతో పోలిస్తే, ఇప్పుడు ఏఐ కారణంగా కోల్పోయే ఉద్యోగాల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది.
అయితే ఏఐ రాకతో ఉద్యోగాలన్నీ పూర్తిగా కనుమరుగవుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది.
ప్రతి ఉద్యోగంలోనూ అనేక రకాల బాధ్యతలు, పనులు ఉంటాయని వివరించింది.
వివరాలు
ఉద్యోగాలన్నీ కనుమరుగవుతాయనుకోవద్దు
ప్రస్తుతం ఏఐ కొన్ని పనులను మాత్రమే సమర్థంగా చేయగలుగుతోందని, ఒక ఉద్యోగి నిర్వహించే అన్ని బాధ్యతలను పూర్తిస్థాయిలో చేపట్టే పరిస్థితి ఇంకా రాలేదని పేర్కొంది.
మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఏఐ వినియోగం విస్తృతంగా పెరగడానికి మరికొంత సమయం పడుతుందని నివేదిక అంచనా వేసింది.
సాంకేతిక రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోనూ ఏఐని ఉపయోగించినప్పుడే ఈ సాంకేతికతపై పెట్టే పెట్టుబడులకు ఆశించిన స్థాయిలో రాబడులు వచ్చే అవకాశం ఉంటుందని వివరించింది.